పోలవరం పెండింగ్‌ డిజైన్లు కొలిక్కి

21 Feb, 2021 08:18 IST|Sakshi
పోలవరం ప్రాజెక్టు డిజైన్లపై సమీక్షిస్తున్న డీడీఆర్పీ సభ్యులు

డీడీఆర్పీ రెండ్రోజుల పర్యటన పూర్తి

సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ ప్రయోగ ఫలితాలు క్షేత్రస్థాయి పనులతో అన్వయింపు

మార్పులు చేర్పులతో డిజైన్లకు తుదిరూపు

మార్చి 15 నాటికి పెండింగ్‌ డిజైన్లు అన్నింటికీ సీడబ్ల్యూసీ ఆమోదం!

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న డిజైన్లు అన్నింటినీ డీడీఆర్పీ (డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌) కొలిక్కి తెచ్చింది. పూణేలో సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ (సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌)లో 3–డీ పద్ధతిలో ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన పోలవరం నమూనా ప్రాజెక్టు ద్వారా అధిక ఒత్తిడితో నీటిని పంపుతూ ప్రయోగాలు నిర్వహించినప్పుడు ఆ వరద చూపిన ప్రభావాలను పరిశీలించిన డీడీఆర్పీ సభ్యులు.. వాటిని శుక్రవారం క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులతో అన్వయించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈఓ చంద్రశేఖర్‌ అయ్యర్, సభ్య కార్యదర్శి రంగారెడ్డి, జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డి, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో డీడీఆర్పీ చైర్మన్‌ ఏబీ పాండ్య శనివారం కూలంకషంగా సమీక్షించారు.

గోదావరి నదీ ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించడానికి 600 మీటర్ల వెడల్పుతో అప్రోచ్‌ ఛానల్‌ను తవ్వేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌లో మరోసారి ప్రయోగాలు నిర్వహించాక అప్రోచ్‌ ఛానల్‌ గైడ్‌ బండ్‌ డిజైన్‌కు తుదిరూపు ఇస్తామన్నారు. ఈ సీజన్‌లో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల ఖాళీ ప్రదేశాలను భర్తీచేసి.. వరద ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించాలని పాండ్యా సూచించారు. స్పిల్‌ వే మీదుగా విడుదల చేసిన వరద నీటి ఉధృతి గోదావరి ఎడమ గట్టు (పురుషోత్తపట్నం గట్టు), కుడి గట్టు (పోలవరం గట్టు)పై చూపే ప్రభావం ఆధారంగా.. వాటిని పటిష్టం చేయడానికి చేపట్టాల్సిన పనులకు సంబంధించిన డిజైన్‌ను ఖరారు చేశారు.

ఈ సీజన్‌లో పూర్తిచేయాల్సిన పనులకు ఏమాత్రం ఆటంకం కలగకుండా డిజైన్లను ఖరారు చేస్తేనే.. గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి అవకాశం ఉంటుందన్న జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డిల అభిప్రాయంతో డీడీఆర్పీ ఏకీభవించింది. పెండింగ్‌లో ఉన్న 29 డిజైన్లను మార్చి 15 నాటికి సీడబ్ల్యూసీతో ఆమోదింపజేసేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తామని.. ఆ మేరకు డిజైన్లను ఖరారుచేయడం ద్వారా పనులకు ఆటంకం కలగకుండా చూస్తామని డీడీఆర్పీ చైర్మన్‌ ఏబీ పాండ్య హామీ ఇచ్చారు. కాగా, పోలవరం ప్రాజెక్టు రెండ్రోజుల పర్యటనను ముగించుకున్న పాండ్య, ఇతర సభ్యులు శనివారం రాత్రి రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి వెళ్లారు.

2022 నాటికి పోలవరం పూర్తి : పాండ్యా
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులు 2022 నాటికి పూర్తవుతాయని డీడీఆర్పీ (డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌) చైర్మన్‌ ఏబీ పాండ్య చెప్పారు. ప్రాజెక్టు డిజైన్లకు సంబంధించిన అంశాలపై పీపీఏ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్, రాష్ట్ర జలవరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డిలతో కలిసి శనివారం రాజమహేంద్రవరంలో ఆయన అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం స్పిల్‌ వే నిర్మాణంలో కీలకమైన 192 గడ్డర్ల అమరిక నేటితో పూర్తయిందన్నారు. స్పిల్‌ వే బ్రిడ్జి 1,128 మీటర్లకుగానూ 1,105 మీటర్లు పూర్తయిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు అమర్చుతున్న గేట్లు ప్రపంచంలోనే అతి పెద్దవని ఆయన వెల్లడించారు. స్పిల్‌ వేకు 48 గేట్లకుగానూ ఇప్పటికే 29 గేట్లను అమర్చారని పాండ్య చెప్పారు. గేట్లకు హైడ్రాలిక్‌ సిలిండర్లు, పవర్‌ ప్యాక్‌లు అమర్చే పనులు వేగంగా సాగుతున్నాయని..  షెడ్యూలు ప్రకారం పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయన్నారు. 

మరిన్ని వార్తలు