జూట్‌ కర్మాగారంలో అగ్ని ప్రమాదం

21 Mar, 2021 05:13 IST|Sakshi
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

కాలి బూడిదైన నిల్వలు

నష్టం రూ.కోటి ఉంటుందని అంచనా

టెక్కలి రూరల్‌ (కోటబొమ్మాళి): మండలంలోని బజీరుపేట కూడలి సమీపంలోని శ్రీసాయి హర్షవర్ధన్‌ జూట్‌ కర్మాగారంలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం షిఫ్టునకు హాజరైన వారు ఎవరి పనుల్లో వారు తలమునకలై ఉన్న సమయంలో ఒక్కసారిగా యంత్రం నుంచి మంటలు చెలరేగాయి. పొగలు దట్టంగా కమ్ముకోవడంతో కార్మికులకు  ఊపిరాడక హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోగా మంటలు ఎగసిపడి జూట్‌ నిల్వలు దగ్ధమయ్యాయి. దాదాపు 500 మంది కార్మికులు విధుల్లో ఉండడంతో వారంతా కొంత సరుకును పట్టుకుని బయటకు పరుగులు తీశారు.

నష్టం రూ.కోటి వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న కోటబొమ్మాళి, టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, శ్రీకాకుళం అగ్ని మాపక కేంద్రాల నుంచి అగ్నిమాపక వాహనాలు సాయంత్రానికి 70 శాతం వరకు మంటలను అదుపు చేశాయి.  జిల్లా అగ్నిమాపక అధికారి సీహెచ్‌ కృష్ణవర్మ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, నష్టాన్ని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదని వివరించారు. 

మరిన్ని వార్తలు