‘నదిలో ఎవరూ ప్రయాణాలు చేయొద్దు’

5 Aug, 2021 21:23 IST|Sakshi

సాక్షి, అమరావతి: పులిచింతల ప్రాజెక్ట్ 16వ గేటు సాంకేతిక లోపం తలెత్తడంతో.. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజ్‌కి వరద నీరు పోటెత్తినట్లు విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. దీంతో మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కృష్ణా, గుంటూరు జిల్లా అధికారులను అప్రమత్తం చేసినట్లు విపత్తు నిర్వహణశాఖ శాఖ తెలిపింది.  సహాయక చర్యలకు విజయవాడలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలో ఎవరూ ప్రయాణాలు చేయవద్దని విపత్తు నిర్వహణశాఖ సూచించింది. ఈ ఘటనకు సంబంధించి పులిచింతల ప్రాజెక్ట్‌ను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పరిశీలించారు. 16వ నంబర్‌ గేట్ వద్ద సాంకేతిక సమస్యను ఆయన పరిశీలించారు. 

కాగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు పులిచింతల ప్రాజెక్ట్‌ వద్దకు వెళ్లారు. అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 16వ నెంబర్ గేటును పరిశీలించారు. రాత్రి జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక సాగర్ నుంచి పులిచింతలకు 1.88లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. పులిచింతల నుండి ప్రాజెక్టు 16వ గేటుతో కలిపి మరో 14 గేట్లు ఎత్తడంతో ఇప్పటివరకు 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 16వ గేట్ అమర్చేందుకు మరో 3 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేయాలని, 5 మీటర్లకు నీటిమట్టం తగ్గిస్తేనే గేటు అమర్చడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించామని, రైతులకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను  తెలిపారు.
 

మరిన్ని వార్తలు