దేశంలోనే తొలి జనరిక్‌ పశు ఔషధ కేంద్రం

24 Mar, 2023 04:14 IST|Sakshi

విజయవాడలో ప్రారంభించిన మంత్రి అప్పలరాజు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పశు పోషకులకు తక్కువ ధరలకే నాణ్యమైన పశువుల జనరిక్‌ మందులను అందించే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్‌ పశు ఔషధ నేస్తం పథకాన్ని అందు­బాటు­లోకి తెస్తున్నామని పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 52 పశు ఔషధ కేంద్రాలను ఏర్పా­టు చేస్తున్నామన్నారు. విజయవాడ­లోని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి జనరిక్‌ పశు ఔషధ కేంద్రాన్ని గురువారం మంత్రి అప్పల­రాజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లా­డుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా మొబైల్‌ అంబులేటరీ క్లినిక్‌­లను ఇప్పటికే అందు­బాటులోకి తెచ్చామ­న్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి జనరిక్‌ పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.  పశువులకు ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తిన­ప్పుడు మందుల కోసం పశు పోష­కులు వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ఆ భారం తగ్గించేందుకే ఈ స్టోర్స్‌­ను ఏర్పాటు చేస్తున్నామ­న్నారు. డబ్ల్యూ­హెచ్‌ఓ సర్టిఫైడ్‌ జీఎంపీ క్వాలిటీ బ్రాండెడ్‌ డ్రగ్స్‌ను చాలా తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకు­రావా­లన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.

ఒక్కో కేంద్రం రూ.4.63 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తు­ండగా.. 75 శాతం ప్రభుత్వం సబ్సి­డీగా అందిస్తుందన్నారు. లబ్ధిదారులు కేవలం 25 శాతం వాటా చెల్లిస్తే సరి­పో­తుందన్నారు. పశు పోష­కులు, ఔత్సా­హిక వ్యాపార వేత్తలు, జాయింట్‌ లయ­బులిటీ గ్రూపులు, స్వ­యం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తి సంస్థలతో పాటు ఆసక్తి కల్గిన ప్రైవేటు వ్యక్తులను కూడా ఈ షాపుల ఏర్పాటుకు ప్రోత్సహిస్తామని చెప్పా­రు. ప్రతి జిల్లా పశు వైద్యశాలలో ఔషధ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వమే కేటా­యిస్తుందన్నారు.

పశు వైద్యులు జనరిక్‌ మందులు మాత్రమే ప్రోత్సహించే విధంగా అవసర­మైన సహకారాన్ని అందిస్తారన్నారు. అనంతరం వెట­ర్నరీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మంత్రి పరిశీలించారు. ఈ తరహా ఆస్పత్రులను రాష్ట్రంలో అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే ఆలో­చన ప్రభుత్వానికి ఉందన్నారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ రెడ్నం అమరేంద్రకుమార్, అద­నపు సంచాలకులు పి.సత్యకుమారి పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు