‘తూర్పు’న జగనన్న ఇచ్చిన పొదరిల్లు

2 Jul, 2021 03:42 IST|Sakshi
పెదరాయవరంలో నిర్మాణం పూర్తయిన ఇంటివద్ద సెల్ఫీ దిగుతున్న సత్తిబాబు, దుర్గాభవానీ

పట్టా రాగానే ఆనందంతో వడివడిగా ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు

తూ.గోదావరి జిల్లాలోని జగనన్న కాలనీల్లో తొలి గృహప్రవేశం రేపు

రంగంపేట: మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు.. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది.. అంటూ దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన గీతం గుర్తొస్తుంది ఈ దంపతుల ఆనందం చూస్తుంటే. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం పెదరాయవరానికి చెందిన ఈ భార్యాభర్తల పేర్లు ఇళ్లపు సత్తిబాబు, దుర్గాభవాని. ఇద్దరూ వ్యవసాయ కూలీలు. కుమారులిద్దరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. సొంతిల్లు లేక ఈ కుటుంబం నానా అవస్థలు పడేది. పోరంబోకు స్థలంలో పూరిగుడిసెలో తలదాచుకునేవారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద పెదరాయవరంలో 195 మందికి ప్రభుత్వం ఇంటిపట్టాలు, ఇళ్లు మంజూరు చేసింది. వీటిలో దుర్గాభవాని పేరిట కూడా పట్టా, ఇల్లు మంజూరయ్యాయి.

ఈ కాలనీలో 71 మంది ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సత్తిబాబు, దుర్గాభవాని దంపతులు ఎంతో ఉత్సాహంతో సొంతింటి కలను సాకారం చేసుకోడానికి వెంటనే నిర్మాణానికి పూనుకున్నారు. నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో అధికారులు చేదోడువాదోడుగా నిలిచారు. ఇప్పటివరకు రూ.1.01 లక్షలు, డ్వాక్రా ద్వారా మరో రూ.50 వేలు మంజూరయ్యాయి. 50 బస్తాల సిమెంట్, ఇసుక ఉచితంగా అందజేశారు. దీంతో కొద్దిరోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తిచేశారు. అంతేకాదు.. శనివారం (ఈ నెల 3న)  గృహప్రవేశం చేయనున్నారు. జిల్లాలోని జగనన్న కాలనీల్లో మొదటగా జరుగుతున్న వీరి గృహప్రవేశానికి అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, జిల్లా జాయింటు కలెక్టర్‌ (హౌసింగ్‌) ఎ.భార్గవ్‌తేజ్‌ హాజరుకానున్నారు. ఇళ్ల లబ్ధిదారులంతా ఈ దంపతుల మాదిరిగా త్వరితగతిన ఇళ్లు నిర్మించుకుంటే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశించిన కొత్త ఊళ్లు త్వరలోనే సాక్షాత్కారమవుతాయి. 
ఇప్పటివరకు సత్తిబాబు, భవానీ ఉన్న ఇల్లు  

జగనన్న దయతో..
ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లులేక ఇబ్బందులు పడుతున్నాం. ఇద్దరు పిల్లలతో రోడ్డు పక్కన పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్నాం. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్న తరుణంలో సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని అనుకునేవాళ్లం. గత ప్రభుత్వంలో అర్జీలు పెట్టుకున్నాం. సెంటు భూమి కూడా ఇవ్వలేదు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదలందరికీ ఇళ్లు ఇస్తామన్న మాట నెరవేర్చి మాలాంటి వాళ్ల బతుకుల్లో ఆనందం నింపారు.     
    – సత్తిబాబు, దుర్గాభవాని, పెదరాయవరం

సౌకర్యాల నిలయాలు
పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు సందడిగా సాగుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా జాతీయ స్థాయి ప్రమాణాలకు మించి లోగిళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. గత సర్కారు హయాంలో కంటే అదనంగా 116 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లను కడుతున్నారు. ఉచితంగా గృహోపకరణాలు, కాలనీల్లో మెరుగైన మౌలిక వసతులు, సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ఇళ్ల నిర్మాణం ద్వారా వైఎస్సార్‌ – జగనన్న కాలనీల్లో పేదలకు ఉత్తమ జీవన ప్రమాణాలు సమకూరనున్నాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా పేదలందరికీ 30.76 లక్షల ఇళ్ల పట్టాలను అక్క చెల్లెమ్మల పేరుతో పంపిణీ చేసి, రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణంలోనూ అంతే వేగంగా ముందుకు వెళుతోంది. ఇళ్ల స్థలాలు పొందిన వారికి  రెండు దశల్లో మొత్తం 28,30,227 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 

నాడు అలా
► టీడీపీ సర్కారు హయాంలో 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు, 24 చదరపు అడుగుల్లో టాయిలెట్‌ నిర్మించారు.
► ఒక బెడ్‌ రూం, వంటగదితో కూడిన లివింగ్‌ రూమ్‌ నిర్మించారు.  
► 2014–19 మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.8,082.89 కోట్లతో 6,03,986 ఇళ్లను మాత్రమే నిర్మించారు.
► మౌలిక సదుపాయాల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. 

నేడు ఇలా
► ఉత్తమ జీవన ప్రమాణాలతో ఇళ్లు నిర్మించేలా డిజైన్‌. 
► 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం. 
► ఒక బెడ్‌రూం, లివింగ్‌ రూం, కిచెన్, టాయిలెట్, వరండా.
► ఉచితంగా రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌ లైట్లు, నాలుగు బల్బ్‌లు, సింటెక్స్‌ ట్యాంక్‌.
► కాలనీల్లో రహదారులు, డ్రైనేజీ, ఇతరత్రా సౌకర్యాల కల్పన  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు