రెండో ఉజ్జయిని.. రాజమహేంద్రవరం

1 May, 2022 03:49 IST|Sakshi
రాజమహేంద్రవరం గోదావరి తీరాన మహాకాళేశ్వరం

దక్షిణాదిన తొలి మహాకాళేశ్వరాలయం ఇక్కడే..

గోదావరి చెంతనే స్వామివారికి చితా‘భస్మాభిషేకం’ 

కైలాస భూముల నుంచి చితాభస్మం సేకరణ 

రోజూ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు భస్మాభిషేకం 

ఉజ్జయినిలో అయితే మహిళలకు నో ఎంట్రీ 

రాజమహేంద్రవరంలో మాత్రం మహిళలకు కూడా ప్రవేశం

ఓవైపు వేదంలా ఘోషించే గోదావరి.. మరోవైపు అమరధామంలా భాసిల్లే రాజమహేంద్రి.. ఇంకోవైపు మహాకాళేశ్వరుడి దర్శన భాగ్యం భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతాయి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మాత్రమే నిర్వహించే భస్మాభిషేకాన్ని చూసే యోగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలోనూ వీక్షించే అవకాశం భక్తులకు దక్కుతోంది.

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అక్కడ నిత్యం... ‘నాగేంద్రహారాయ త్రిలోచనాయ.. భస్మాంగరాయ మహేశ్వరాయ.. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ.. తస్త్మేన్త కారాయ నమశ్శివాయ!’ అంటూ వేద మంత్రాలు వినసొంపుగా వినిపిస్తుంటాయి. మహాకాళేశ్వరుడికి నిర్వహించే భస్మాభిషేకం భక్తులను ఆధ్యాత్మిక ఆనంద ఝరిలో ఓలలాడిస్తుంది. దక్షిణ భారతదేశంలోనే తొలి మహాకాళేశ్వరాలయం గోదావరి చెంత కొలువుదీరింది. ఈ ఆలయం దక్షిణాది రాష్ట్రాల నుంచి రాజమహేంద్రవరం వచ్చే భక్తులను భక్తిపారవశ్యంతో కట్టిపడేస్తోంది. రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయ విశేషాలు ఇవి.. 

ఆలయ నిర్మాణానికి బీజం పడిందిలా.. 
రోటరీ క్లబ్‌ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే మార్వాడీలతోపాటు ఉజ్జయిని వెళ్లిన రోటరీ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పట్టపగలు వెంకట్రావు అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. దేశం గర్వించదగ్గ ఇటువంటి ఆలయాన్ని రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన నిర్మించాలని నిర్ణయించారు. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడికి జరిపే భస్మాభిషేకానికి మహాద్భుతమైన క్రతువుగా దేశవ్యాప్తంగా పేరుంది. ఈ భస్మాభిషేకాన్ని చూడటానికి దేశం నలుమూలల పెద్ద ఎత్తున భక్తులు ఉజ్జయిని వెళుతుంటారు. ఈ నేపథ్యంలో ఉజ్జయిని మహాకాళేశ్వరాలయాన్ని సందర్శిస్తే లభించే అనుభూతిని దక్షిణాది రాష్ట్రాల భక్తులకు అందించాలని రాజమహేంద్రవరంలో ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పవిత్ర గోదావరి నదీ తీరాన గౌతమీ ఘాట్‌లో రెండు ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా మహాకాళేశ్వర ఆలయం రూపుదిద్దుకుంది. ఇటీవల టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభమైంది. 

ఆధునికత ఉట్టిపడేలా.. ఆధ్యాత్మికుల మనసు దోచుకునేలా.. 
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వాసు అనే శిల్పి రూపొందించిన అద్భుతమైన నమూనాతో మహాకాళేశ్వరుడి ఆలయ నిర్మాణం రూపుదిద్దుకుంది. భూమి ఉపరితలం నుంచి 55 అడుగుల పునాదితో అత్యంత ఆధునికత ఉట్టిపడేలా చేపట్టిన 109 అడుగుల గర్భాలయ నిర్మాణం భక్తుల మనసు దోచుకుంటోంది. 75 అడుగుల ఎత్తైన నాలుగు గాలిగోపురాలు, 50 అడుగులతో అతి విశాలమైన నాలుగు మండపాలు, 55 అడుగుల ఎత్తైన నాలుగు ధ్వజస్తంభాలు, నాలుగు బలిపీఠాలు, నాలుగు త్రిశూలాలు, నాలుగు నందులను తిలకించారంటే భక్తులు ఆనందపారవశ్యంతో మునిగితేలాల్సిందే. గర్భాలయానికి నాలుగు వైపుల గుమ్మాలతో ఆలయాన్ని నిర్మించడం ఇక్కడ మరో విశేషం. 32 ద్వైత, 32 అద్వైత ఆలయాలతో కలిపి మొత్తంగా 64 ఉపాలయాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఉప ఆలయాలను దర్శించుకుంటూనే మహాకాళేశ్వర గర్భాలయంలోకి వెళ్లేలా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. గర్భాలయంలో ప్రధాన శివలింగంతోపాటు బలిపీఠాలు, నందులు తిరుమలలో, ఉప ఆలయాల్లోని విగ్రహాలను రాజస్థాన్‌లోని జైపూర్‌లో తయారుచేయించారు. 

ప్రత్యేకం.. భస్మాభిషేకం  
రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది.. భస్మాభిషేకం. ఇక్కడ రోజూ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు శాస్త్రోక్తంగా జరిపే భస్మాభిషేకాన్ని వీక్షించడానికి వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ భస్మాభిషేకం కోసం రోటరీ క్లబ్‌ నిర్వహిస్తోన్న రెండు కైలాస భూముల నుంచి చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా సేకరించి ఆలయానికి తెస్తారు. దేహం చాలించిన వారి చితాభస్మాన్ని తెల్లటి వస్త్రంలో మూటగట్టి లింగాకారంలో ఉన్న మహాకాళేశ్వరుడికి అర్చకులు అభిషేకిస్తారు. దేహం చాలించిన ప్రతి ఒక్కరి ఆత్మ చితాభస్మాభిషేకంతో శాంతిస్తుందనేది భక్తుల నమ్మకం. ఉజ్జయినిలో అయితే భస్మాభిషేకానికి పురుషులను మాత్రమే అనుమతిస్తారు. కానీ రాజమహేంద్రవరంలో మహిళలకు కూడా అనుమతిస్తున్నారు.  

దక్షిణాది రాష్ట్రాలకు అందుబాటులో ఉండాలనే.. 
రాజమహేంద్రవరం ఖ్యాతి దేశం నలుదిశలా విస్తరించాలనే సంకల్పంతోనే ఆలయం నిర్మించాం. చారిత్రక నగరం కావడంతో ఇక్కడి ప్రాశస్త్యం భావితరాలకు గుర్తుండిపోవాలనే ఆలయాన్ని ప్రారంభించాం. దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ఇది ఎంతో అందుబాటులోకి వచ్చింది. మరింత అభివృద్ధి చేస్తాం. 
– పట్టపగలు వెంకట్రావు, చైర్మన్, రోటరీ చారిటబుల్‌ ట్రస్ట్, మహాకాళేశ్వరాలయం  

మరిన్ని వార్తలు