డాక్టర్‌.. ప్లాస్మా దాత

4 Aug, 2020 09:08 IST|Sakshi
ప్లాస్మాదానం చేసిన డాక్టర్‌తో మాట్లాడుతున్న కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు

ప్లాస్మా దానానికి ముందుకు రావాలి:  కలెక్టర్‌ 

రూ.5 వేల ప్రోత్సాహక బహుమతి ఇస్తాం 

నెల్లూరు(అర్బన్‌): కోవిడ్‌ నుంచి కోలుకున్న బాధితులు ప్లాస్మా దానం చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుకు స్పందించిన ఓ డాక్టర్‌ ప్లాస్మా దానం చేసి, జిల్లాలో తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. కరోనా సోకి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానానికి ముందుకు రావాలని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు సూచించారు. సోమవారం నగరంలోని రెడ్‌క్రాస్‌ కార్యాలయాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డితో కలిసి కలెక్టర్‌ సందర్శించారు. అక్కడ తొలిసారిగా ప్లాస్మా దానాన్ని చేస్తున్న డాక్టర్‌ చక్రవర్తితో మాట్లాడారు. కోవిడ్‌ చికిత్సలో కీలకమైన ప్లాస్మా దానానికి తొలిసారిగా ముందుకు వచ్చిన నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ చక్రవర్తిని అభినందించారు.

అనంతరం రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌లోని నాణ్యమైన సేవలను, మిషనరీని ఆయన పరిశీలించారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారిలో 99 శాతం చికిత్స తీసుకుని కోలుకుని నెగటివ్‌ రిపోర్టుతో ఇంటికి వెళ్తున్నారన్నారు. తీవ్రమైన కోవిడ్‌ లక్షణాలున్న వారికి ఆస్పత్రిలో చికిత్స అందించడానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలన్నారు. ప్లాస్మాను ఏడాది పాటు నిల్వ చేయవచ్చని, అవసరమైనప్పుడు ఆ ప్లాస్మాను రోగులకు ఎక్కించి చికిత్స చేయవచ్చన్నారు. ఒకరి ప్లాస్మాతో ఇద్దరి రోగులను కాపాడేందుకు వీలవుతుందన్నారు. ప్లాస్మా దానం చేసే వారికి రూ.5 వేల ప్రోత్సాహక బహుమతిగా ప్రభుత్వం ఇస్తుందన్నారు. రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ పి.చంద్రశేఖర్‌రెడ్డి, మేనేజింగ్‌ కమిటీ సభ్యులు నరసారెడ్డి, సురేష్, బ్లడ్‌ బ్యాంకు కన్వీనర్‌ అజయ్‌బాబు, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ యశోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు