వ్యవసాయ వర్సిటీకి మొదటి స్థానం

14 Apr, 2022 05:30 IST|Sakshi

‘వైఎస్సార్‌ ఉద్యాన’ వర్సిటీకి ద్వితీయ స్థానం

సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో రాష్ట్రానికి చెందిన ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలవగా, డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం రెండో స్థానంలో నిలిచింది. 2021–22 విద్యాసంవత్సరంలో వ్యవసాయం, వ్యవసాయ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఎన్‌జీ రంగా, హార్టి కల్చర్‌ అండ్‌ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్‌ కేటగిరీలో ఉద్యాన వర్సిటీ ఈ అవార్డులను దక్కించుకుంది.

బుధవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల శాఖ మంత్రి పర్షోత్తమ్‌ఖడోభాయ్‌ రూ పాలా, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ త్రి లోచన్‌ మహాపాత్ర  చేతుల మీదుగా ఎన్‌జీ రంగా, ఉద్యాన వర్సిటీ వీసీలు డాక్టర్‌ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి, డాక్టర్‌ టి.జానకీరామ్‌ అందుకున్నారు.

ఆయా కేటగిరీల్లో అత్యధిక పీజీ స్కా లర్‌షిప్‌లు మన రాష్ట్రానికి చెందిన వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల విద్యార్థులు పొందారు. జాతీయ స్థాయిలో 63 వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో పోటీపడిన ఎన్‌జీ రంగా వర్సిటీ మొదటి స్థానంలో నిలవగా, ఏడు ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో బెంగళూరు ఉద్యాన వర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది. వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ రెండో స్థానం దక్కించుకుంది.   

మరిన్ని వార్తలు