పంజరంలో పండు‘గొప్ప’ 

19 Dec, 2022 06:08 IST|Sakshi
కృష్ణా జిల్లా లక్ష్మీపురం ఉప్పుటేరులో ఏర్పాటు చేసిన కేజ్‌లో పట్టుబడిన పండు గొప్ప చేపలు

4 పంజరాల్లో 1.85 టన్నుల దిగుబడి 

కిలో రూ.460 చొప్పున విక్రయం 

సాక్షి, అమరావతి: తీరం వెంబడి విస్తరిస్తున్న పంజరం చేపల సాగు (కేజ్‌ కల్చర్‌) సిరుల పంట పండిస్తోంది. కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన కేంద్రం (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) సాంకేతిక చేయూత అందించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కింద సీడ్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. సీఎంఎఫ్‌ఆర్‌ఐ సహకారంతో కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం వద్ద ఉప్పుటేరులో కేజ్‌ కల్చర్‌ చేపట్టిన యానాదులకు సిరుల పంట పండింది.  

1.85 టన్నుల పండుగప్ప దిగుబడి 
ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కింద గత ఏడాది డిసెంబర్‌లో 585 మీటర్లు పరిమాణం గల 4 పంజరాల్లో 80 నుంచి 100 గ్రాముల బరువు గల పండుగప్ప చేప పిల్లలను వదిలారు. ఏడాది కాలంలో ఇవి కేజీన్నర నుంచి 2 కేజీల వరకు బరువు పెరిగాయి. 4 పంజరాల్లో తాజాగా పట్టుబడి పట్టగా 1.85 టన్నుల దిగుబడి వచ్చింది. కిలో రూ.460 చొప్పున విక్రయించారు.

మరో 700 గ్రాముల సైజులో మరో 400 కేజీల వరకు పట్టుబడి చేయాల్సి ఉంది. వేటకు వెళ్లే ఈ కుటుంబాలు చిన్నపాటి చేపలను తీసుకొచ్చి పంజరాల్లోని పండుగప్పలకు మేతగా ఉపయోగించేవారు. పైసా పెట్టుబడి లేకుండా ఒక్కో పంజరం నుంచి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆర్జించారు.

భూమిలేని పేదలకు వరం 
భూమిలేని పేదలకు ఇది ఎంతో లాభదాయకమని సీఎంఎఫ్‌ఆర్‌ఐ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ శేఖర్‌ మేఘరాజన్‌ అన్నారు. సీఎంఎఫ్‌ఆర్‌ఐ ఇచ్చిన చేయూత వల్ల తమ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగాయని ఎస్టీ మత్స్యకారుడు నాగరాజు ఆనందం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు