Fishermen: నూక తాతకు వింత మొక్కులు

3 Mar, 2022 17:02 IST|Sakshi
భక్తులపై నుంచి దాటుకుంటూ వెళ్తున్న పూజారులు(ఇన్‌సెట్లో) పల్లకీ మోస్తున్న ఎమ్మెల్యే గొల్ల బాబూరావు

నక్కపల్లి(పాయకరావుపేట): వింత ఆచారాలు.. వినూత్న సంప్రదాయాలు అబ్బురపరుస్తాయి. వాటి వెనుక ఉన్న చరిత్ర ఆసక్తి కలిగిస్తుంది. ఈ కోవకే చెందుతుంది నూకతాత పండగ.  రాజయ్యపేటలో కనీవినీ ఎరుగని వింత ఆచారంతో ఏటా ఈ పండగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాదీ మత్స్యకారులంతా భక్తి శ్రద్ధలతో..  ఘనంగా ఈ పండగ నిర్వహించారు.

చదవండి: అనూస్‌ పేరుతో బ్యూటీ పార్లర్‌.. స్థానికులతో పరిచయం పెంచుకుని.. చివరికి

మత్య్సకారులు అధికంగా ఉండే రాజయ్యపేటలో మహా శివరాత్రి మరుసటి రోజు నూకతాత పండగ జరుగుతుంది. నూక తాతను గంగపుత్రులు తమ కులదైవంగా భావిస్తారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఈ ఏడాది కొనసాగించారు. బుధవారం నూకతాత విగ్రహాలను సముద్రస్నానానికి తీసుకెళ్లారు. తిరిగి ఆలయానికి విగ్రహాలను తీసుకొచ్చే సమయంలో భక్తులు రోడ్డుపై పడుకున్నారు. వీరి పై నుంచి విగ్రహాలను చేతపట్టిన పూజారులు దాటుకుంటూ వెళ్లారు.

ఇలా పడుకుని మొక్కులు చెల్లించుకోవడం ద్వారా తమ కోర్కెలు నెరవేరుతాయనేది ఇక్కడి మత్య్సకారుల నమ్మకం. నూకతాత పండగలో జంతు బలి నిషేధం. రక్తం చిందించడాన్ని నూకతాత ఒప్పుకోడని మత్య్సకారులు చెబుతారు. ఈ పండగ పురస్కరించుకుని గ్రామంలో పెద్ద తిరునాళ్లు జరిగింది. భారీ సెట్టింగులు ఏర్పాటు చేశారు. బాణసంచా సంబరాలు మిన్నంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అదిరిపోయాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా నూకతాత పండక్కి రాజయ్యపేట చేరుకున్నారు. బంధువులు, స్నేహితుల రాకతో గంగపుత్రుల ఇళ్లన్నీ సందడిగా మారాయి.

మరిన్ని వార్తలు