జల నిధిలోనూ సౌర కాంతులు

23 Oct, 2022 08:03 IST|Sakshi

ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లు

దేశవ్యాప్తంగా విద్యుత్‌ ఉత్పత్తిలో సరికొత్త విప్లవం

ఇన్నాళ్లూ పొలాలు.. స్థలాలు.. ఇంటిపైనే సోలార్‌ ప్లాంట్లు

ఇప్పుడు నీటి వనరులు.. భారీ జలాశయాలపై తేలియాడే సోలార్‌ యూనిట్లు

ఓంకారేశ్వర్‌ ఆనకట్ట వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌

విశాఖలోని సింహాద్రి పవర్‌ ప్లాంట్‌లోనూ ఏర్పాటు

సాక్షి, అమరావతి: భూమిపై మనం ఉపయోగిస్తున్న శక్తికి మూలాధారం సూర్యుడే. సూర్యుడంటే ఒక ఆదర్శ శక్తి జనకం. మూడు వేల సంవత్సరాల క్రితమే సూర్యుడి నుంచి విద్యుత్‌ పుట్టించవచ్చనే విషయాన్ని మానవుడు ఆవిష్కరించినట్టు చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. విజ్ఞానం ఎప్పుడూ ఆవిష్కరణ చోటే ఆగిపోదు. అక్కడి నుంచి మరో కొత్త అన్వేషణ మొదలవుతూనే ఉంటుంది. అప్పటినుంచి సౌర శక్తిని ఒడిసి పట్టుకోవడానికి విశ్వవ్యాప్తంగా అనేక పరిశోధనలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఆ యజ్ఞంలోంచి ఆవిర్భవించిన సరికొత్త సాంకేతికతే నీటిలో తేలియాడే సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది చివరి నాటికి 100 గిగావాట్ల విద్యుత్‌ను వీటి ద్వారా ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం.

విశాఖలో మొదలై..
విశాఖ జిల్లా ఎన్టీపీసీ సింహాద్రి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో 75 ఎకరాల్లోని నీటి వనరుల్లో 25 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం గల ఫ్లోటింగ్‌ సోలార్‌ పవర్‌ను నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ) తొలుత ప్రారంభించింది. ప్రారంభించే నాటికి దేశంలోనే ఇదే అతిపెద్దది. ఇందులో లక్షకుపైగా ఉన్న సోలార్‌ పలకల ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతోంది. అదే విశాఖలో మేఘాద్రిగడ్డ రిజర్వాయర్‌పై 2.41 మెగావాట్ల ప్లాంట్‌ను జీవీఎంసీ నెలకొల్పింది. ఆ తరువాత తెలంగాణలో రామగుండం వద్ద ఉన్న థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ రిజర్వాయర్‌లో ఎన్టీపీసీ ఇలాంటి ఓ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసింది. 100 మెగావాట్ల సామర్థ్యంతో 450 ఎకరాల మేర విస్తరించి ఉన్న సోలార్‌ ఫోటో వోల్టాయిక్‌ ప్రాజెక్టులో 4.50 లక్షల సోలార్‌ ప్యానల్స్‌ ఉంటాయి. 

ఇతర రాష్ట్రాల్లోనూ..
కేరళలోని కయంకుళం గ్యాస్‌ ప్లాంట్‌లో 92 మెగావాట్ల ఫ్లోటింగ్‌ యూనిట్‌ మొదలైంది. కేరళలోని కయంకుళం (100 కిలోవాట్లు), గుజరాత్‌లోని కవాస్‌ వద్ద ఒక మెగావాట్‌ సామర్థ్యంతో పైలట్‌ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశాయి. మరికొన్ని చోట్ల ఈ తేలియాడే సౌర ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఎన్టీపీసీ నిర్ణయించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్‌ (600 మెగావాట్ల) సౌర శక్తి ప్రాజెక్ట్‌ మనదేశంలో రాబోతోంది. మధ్యప్రదేశ్‌ ఖాండ్వా జిల్లాలోని నర్మదా నదిపై ఓంకారేశ్వర్‌ ఆనకట్ట వద్ద నిర్మించనున్న ఈ ప్రాజెక్టు 2022–23లోనే విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. ఆనకట్టలో సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 2 వేల హెక్టార్ల నీటి ప్రాంతంలో విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది.

అనేక ప్రయోజనాలు
ఫ్లోటింగ్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌లను ఫ్లోటో–వోల్టాయిక్స్‌ అని కూడా పిలుస్తారు. వీటి ఏర్పాటుకు భూమి అవసరం లేదు.  నీటిపైనే అమరుస్తారు. వీటివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు  అంటున్నారు. ఇవి సంప్రదాయ సోలార్‌ ప్యానల్స్‌ కంటే ఖరీదైనవి. అయితే, ఫ్లోటింగ్‌ సోలార్‌ ఇన్‌న్టలేషన్‌ల పెట్టుబడిపై రాబడి కూడా నేలపై నిర్మించే (గ్రౌండ్‌ మౌంటెడ్‌) వాటి కంటే ఎక్కువగా ఉంటుంది.

ఎక్కువ ప్రాంతంలో విస్తరిస్తాయి. నిర్వహణ కూడా భారీగా ఉంటుంది. అయితే, తేలియాడే సోలార్‌ ప్యానల్స్‌ ఎక్కువగా తుప్పు పట్టవు. లోడ్‌ కెపాసిటీ, సుదీర్ఘ జీవితకాలం ఉంటుందని ఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌లో వాతావరణ మార్పు, పునరుత్పాదక ఇంధన విభాగం నిపుణులు చెబుతున్నారు. ప్యానల్స్‌ సహజ శీతలీకరణ కారణంగా అవి నేలపై వాటి కంటే ఐదు నుండి ఏడు శాతం మెరుగైన ఫలితాలను ఇస్తాయి. 25 సంవత్సరాలకు పైగా నీటిలో ఉన్నా ఈ ప్యానళ్లకు ఏమీ కాదు. రిజర్వాయర్‌లు, సరస్సులు, నీటిపారుదల కాలువలు వంటివి తేలియాడే సోలార్‌ ప్యానెల్‌ల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటాయి. వీటిపై ఏర్పాటు చేయడం వల్ల వరదల వల్ల ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవు. నీటి మట్టాల హెచ్చుతగ్గులకు తగ్గట్టుగా సోలార్‌ ప్యానెల్స్‌ పైకీకిందికి కదులుతాయి తప్ప మునిగిపోయే అవకాశం లేదని విద్యుత్‌ రంగ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు