నిలకడగా వరద

4 Oct, 2020 05:19 IST|Sakshi
సాగర్‌ ప్రాజెక్టులో 6 క్రస్ట్‌గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌/విజయపురి సౌత్‌ (మాచర్ల): కృష్ణా, పెన్నా, వంశధార నదుల్లో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న కృష్ణా ప్రవాహానికి తుంగభద్ర, హంద్రీ వరద తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం 1,58,230 క్యూసెక్కులు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్‌కు 1,66,994 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 6 రేడియల్‌ క్రస్ట్‌గేట్ల ద్వారా 1,39,685 క్యూసెక్కులు, కుడిగట్టు కేంద్రంలో విద్యుత్‌ ఉత్పాదన ద్వారా 27,309 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శనివారం మధ్యాహ్నానికి జూరాల, సుంకేశుల, హంద్రీ నుంచి శ్రీశైలం జలాశయానికి 86,330 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. 

► పులిచింతల ప్రాజెక్టులో 174.73 అడుగుల్లో 45.36 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 
► ప్రకాశం బ్యారేజీలోకి 96,560 క్యూసెక్కులు చేరుతుండగా, కృష్ణా డెల్టాకు 9700 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 87,775 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా 
కడలిలోకి వదులుతున్నారు. సోమశిలలోకి పెన్నా వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 95,491 క్యూసెక్కులు చేరుతుండగా.. కండలేరుకు 10,407 క్యూసెక్కులు వదులుతున్నారు. 

నేడు, రేపు తేలికపాటి వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 కి.మీ. ఎత్తులో, దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో 7.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడచిన 24 గంటల్లో అమలాపురంలో 2 సెం.మీ., కైకలూరు, కుక్కునూరు, నూజివీడు, డెంకాడ, పూసపాటిరేగ, చెన్నెకొత్తపల్లిలో 1 సెం.మీ. వర్షపాతం నమోదైంది.  

మరిన్ని వార్తలు