శ్రీశైలం జలాశయం @ 854 

27 Jul, 2020 05:10 IST|Sakshi

సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్‌: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ప్రాజెక్టులో నీటి నిల్వ 854 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత జలాశయంలో 89.09 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కర్నూల్‌ జిల్లాలో శనివారం కురిసిన వర్షాలతో హంద్రీ, తుంగభద్ర నదులు ఉరకలెత్తుతున్నాయి. జూరాల నుంచి విడుదల చేసిన నీటితో కలుపుకొని ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 74,720 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నాగార్జునసాగర్‌లోకి 42,378 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 186.46 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 

► గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా ఉంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 79,449 క్యూసెక్కులు వస్తుండగా, గోదావరి డెల్టా కాలువలకు 9,200 క్యూసెక్కులు విడుదల చేసి మిగిలిన 70,249 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు.  
► వంశధార నది నుంచి గొట్టా బ్యారేజీలోకి 5,223 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా కాలువలకు 1,354 క్యూసెక్కులు విడుదల చేసి, మిగిలినవి సముద్రంలోకి వదులుతున్నారు. 
► మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణాకు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది.  

>
మరిన్ని వార్తలు