కృష్ణాలో వరద ఉధృతి 

12 Sep, 2020 05:51 IST|Sakshi

శ్రీశైలంలోకి 2.28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం.. ఎనిమిది గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్, పులిచింతల గేట్లు ఎత్తివేత

రాత్రికి ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేసే అవకాశం

ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 1.07 లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు కడలిలోకి

సాక్షి, అమరావతి/ విజయపురి సౌత్‌/ శ్రీశైలం ప్రాజెక్టు: కృష్ణా, ఉప నదులు తుంగభద్ర, భీమా పరవళ్లు తొక్కుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం భారీగా పెరిగింది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు 2,28,584 క్యూసెక్కులు చేరుతుండగా.. ఎనిమిది గేట్లు ఎత్తి 2,23,128 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.6 అడుగుల్లో 213.40 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

► నాగార్జునసాగర్‌లో నీటి మట్టం 590.0 అడుగులకు చేరుకుంది. దాంతో 12 గేట్లు ఎత్తి అదే స్థాయిలో వరదను దిగువకు విడుదల చేస్తున్నారు.
► పులిచింతల ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి 1,20,330 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
► పులిచింతల నుంచి విడుదల చేస్తున్న జలాలు చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టం పెరుగుతోంది. శుక్రవారం రాత్రికి బ్యారేజీ గేట్లు ఎత్తేయనున్నారు.
► మరోవైపు, పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గిపోవడంతో శనివారం నుంచి శ్రీశైలంలోకి వచ్చే వరద ప్రవాహం తగ్గుముఖం పట్టనుంది.
► గోదావరిలో వరద మరింత తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మిగులుగా ఉన్న 1,07,298 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

ప్రవాహాల వివరాలిస్తే ‘మిగులు’ లెక్క తేల్చుతాం
ఏపీ, తెలంగాణలకు కృష్ణా బోర్డు లేఖ
కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో గత 20 ఏళ్లుగా జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీలలోకి వచ్చిన వరద ప్రవాహాలు.. విడుదల చేసిన ప్రవాహాల వివరాలు ఇస్తే మిగులు జలాల లెక్క తేల్చుతామని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. కేంద్ర జలసంఘం.. సీఈ విజయ్‌ శరణ్‌ నేతృత్వంలో కేంద్రం ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీకి తక్షణమే వివరాలు పంపాలని సూచించింది.

► జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి, సముద్రంలోకి వదులుతున్న సమయంలో.. ఏ రాష్ట్రం వాడుకున్నా సరే ఆ నీటిని లెక్కలోకి తీసుకోకూడదని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు విజ్ఞప్తి చేస్తోంది. దీన్ని తెలంగాణ సర్కార్‌ వ్యతిరేకిస్తూ వస్తోంది.
► ఇరు రాష్ట్రాల సూచనల మేరకు మిగులు జలాల లెక్క తేల్చాలని కేంద్రానికి కృష్ణా బోర్డు లేఖ రాసింది. దాంతో మిగులు జలాల లెక్క తేల్చేందుకు సీడబ్ల్యూసీ సీఈ విజయ్‌ శరణ్‌ నేతృత్వంలో సాంకేతిక కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు మరిన్ని వివరాలు పంపాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్‌ మీనా శుక్రవారం లేఖ రాశారు.   

మరిన్ని వార్తలు