గోదావరి, కృష్ణాలో వరద తగ్గుముఖం

21 Aug, 2022 04:08 IST|Sakshi
శ్రీశైలం నుంచి 7 గేట్ల ద్వారా నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

వంశధార, నాగావళిలో పెరిగిన వరద ప్రవాహం 

సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/చింతూరు/శ్రీశ్రీశైలం ప్రాజెక్ట్‌/విజయపురిసౌత్‌(మాచర్ల): పరీవాహక ప్రాంతాల(బేసిన్‌)లో వర్షాలు తగ్గడంతో గోదావరి, కృష్ణా నదుల్లో వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 39.8 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల నుంచి విడుదల చేస్తున్న ప్రవాహంలో ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 13,05,222 క్యూసెక్కులు వస్తోంది. ఇక్కడి నుంచి గోదావరి డెల్టాకు 11 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 12,94,222 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.

వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు
కృష్ణాలో వరద ప్రవాహం తగ్గింది. కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రపై ఉన్న తుంగభద్ర డ్యామ్, భీమాపై ఉన్న ఉజ్జయిని డ్యామ్‌లు నిండుగా ఉండటంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు.ప్రస్తుతం శ్రీశైలంలో 884.4 అడుగుల్లో 212.43 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్‌లోకి 2,25,787 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువ ద్వారా 9,104, ఎడమ కాలువ ద్వారా 8,108, ఏఎమ్మార్పీ ద్వారా 2,400, వరద కాలువ ద్వారా 400, ప్రధాన విద్యుత్కేంద్రం ద్వారా 32,195 క్యూసెక్కులు, స్పిల్‌ వే 22 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,73,580 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.

ప్రస్తుతం సాగర్‌లో 586 అడుగుల్లో 301.1 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు.  సాగర్‌ నుంచి వదులుతున్న జలాల్లో పులిచింతలలోకి 2,01,752 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్‌ వే 5 గేట్లను 3.5 అడుగుల మేర ఎత్తి 1,31,213 క్యూసెక్కులు, విద్యుత్‌ కేంద్రం ద్వారా 8 వేలు వెరసి 1,39,213 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో 169.71 అడుగుల్లో 37.95 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,36,531 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 12,901 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 1,23,630 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.

వంశధార, నాగావళి పోటాపోటీ:
వంశధార, నాగావళి నదులు పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. వంశధార నుంచి గొట్టా బ్యారేజ్‌లోకి 48,583 క్యూసెక్కులు వస్తున్నాయి. ఆయకట్టుకు 1,665 క్యూసెక్కులు, కడలిలోకి 38,307 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. నాగావళి నుంచి తోటపల్లి బ్యారేజ్‌లోకి 23,330 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 1,520 క్యూసెక్కులు, మిగులుగా ఉన్న 21,256 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు.

మరిన్ని వార్తలు