సహాయం.. శరవేగం 

20 Jul, 2022 03:46 IST|Sakshi
కోనసీమ జిల్లా పాశర్లపూడిలోని ప్రభుత్వ పునరావాస కేంద్రంలో భోజనం చేస్తున్న బాధితులు

ముమ్మరంగా కొనసాగుతున్న వరద సహాయక చర్యలు 

ఇప్పటివరకు ముంపు ప్రాంతాల నుంచి 1.42 లక్షల మంది తరలింపు

పునరావాస కేంద్రాల్లో 1.22 లక్షల మందికి ఆశ్రయం 

297 మెడికల్‌ క్యాంపుల ద్వారా వైద్య సేవలు 

5 లక్షల ఆహార పొట్లాల పంపిణీ 

తక్షణ అవసరాల కోసం రూ.41.50 కోట్లు విడుదల 

నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలు 

సాక్షి, అమరావతి: గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరద తీవ్రత తగ్గినా ఇంకా కొనసాగుతుండటంతో సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం రాజీ పడకుండా ముందుకెళుతోంది. బాధితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. 6 జిల్లాల్లో పరిధిలోని 62 మండలాలు, 727 గ్రామాల్లో అధికార యంత్రాంగం విరామం లేకుండా.. విశ్రమించకుండా పని చేస్తూనే ఉంది. 324 గ్రామాలు పూర్తిగా ముంపు బారినపడగా.. 403 గ్రామాల్లోకి వరద నీరు చేరింది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 143 గ్రామాలు ముంపులో ఉండగా, 165 గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ఏలూరు జిల్లాలో 76 గ్రామాలు ముంపులో ఉండగా, 93 గ్రామాల్లోకి నీరు చేరింది. కోనసీమ జిల్లాలో 61 గ్రామాలు మునిగిపోగా, 74 గ్రామాల్లో వరద ప్రభావానికి గురయ్యాయి. వీటితోపాటు తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లో సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి. 

సురక్షిత ప్రాంతాలకు 1.42 లక్షల మంది
324 ముంపు గ్రామాల నుంచి మొత్తం 1,42,655 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందులో 1,22,920 మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన 217 సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అల్లూరి జిల్లాలోనే 103 సహాయక శిబిరాల్లో 69,112 మంది ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 24,152 మంది, ఏలూరు జిల్లాలో 18,707 మంది, కోనసీమ జిల్లాలో 9,236 మంది, కాకినాడ జిల్లాలో 1,243 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 470 మంది సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

సహాయక శిబిరాలు, వరద నీరు చేరిన గ్రామాల్లో 297 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అనారోగ్యానికి గురైన వారికి చికిత్స అందిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ఇప్పటివరకు 5 లక్షల ఆహార పొట్లాలు, 25 లక్షల మంచినీళ్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. 

321 మంది గర్భిణుల తరలింపు
ముంపు ప్రాంతాల్లోని గర్భిణులు ఇబ్బందులు పడకుండా వైద్య శాఖ చర్యలు చేపట్టింది. వీరిని ముందే గుర్తించి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇప్పటివరకూ నాలుగు జిల్లాల్లో 321 మంది గర్భిణులను ఆస్పత్రులు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరికి వైద్య సేవలు అందించడం కోసం గైనకాలజిస్ట్, అనస్తీషియా, ఇతర స్పెషాలిటీ వైద్యులను ఇతర జిల్లాల నుంచి తరలించారు. 

రూ.41.50 కోట్లు విడుదల 
ముంపు ప్రాంతాల్లో తక్షణ అవసరాల కోసం ప్రభుత్వం రూ.41.50 కోట్లు విడుదల చేసింది. అల్లూరి జిల్లాకు రూ.10.50 కోట్లు, కోనసీమ జిల్లాకు రూ.12 కోట్లు, తూర్పు గోదావరికి రూ.4 కోట్లు, ఏలూరు జిల్లాకు రూ.9 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాకు రూ.6 కోట్లు విడుదల చేయగా.. ఆయా జిల్లాల కలెక్టర్లు వాటిని సహాయక చర్యలకు వినియోగిస్తున్నారు. ముంపు బారిన పడిన కుటుంబాలకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల సహాయాన్ని అందిస్తున్నారు. బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ చురుగ్గా సాగుతోంది. ఇందుకోసం ఇప్పటివరకు 944 టన్నుల బియ్యం, 89.89 టన్నుల కందిపప్పు, 60,051 లీటర్ల పామాయిల్, 80,685 లీటర్ల పాలు, 97,701 కేజీల ఉల్లిపాయలు, 97,701 కేజీల బంగాళా దుంపలు వినియోగించారు.

మూగజీవాలకు రక్షణగా..
కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తినప్పటికీ ఆరు జిల్లాల పరిధిలో మృత్యు వాత పడిన పశువులు కేవలం ఆరు మాత్రమే. పైగా 24 గంటల్లోనే పరిహారం కూడా అందించి పాడి రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. 6 జిల్లాల పరిధిలో 84,592 పశువులుండగా, వరద ప్రభావానికి గురైన 226 గ్రామాల్లో చిక్కుకున్న దాదాపు 30 వేల పశువులను పశు సంవర్థక శాఖ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస చర్యల కోసం 124 ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 594.95 టన్నుల దాణాను ఉచితంగా పంపిణీ వేశారు.

పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం 111 ప్రత్యేక పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వ్యాధులు సోకకుండా 27,297 పశువులకు హెచ్‌ఎస్, బీక్యూ, బీటీ, ఈటీ వ్యాక్సినేషన్స్‌ చేశారు. వరదల వల్ల గాయపడిన 2,254 పశువులకు ప్రత్యేక వైద్య సహాయం అందించారు. రూ.14 లక్షల విలువైన మందులను ఉచితంగా అందించారు. పశువుల దాణా కోసం కోసం పశు సంవర్థక శాఖ రూ.2.41 కోట్లు విడుదల చేసింది. వరద ఉధృతి తగ్గినప్పటికీ ప్రభావిత లంక గ్రామాల్లో వైద్య శిబిరాలను కొనసాగిస్తున్నారు. కనీసం వారం రోజులకు సరిపడా దాణా, పశుగ్రాసం అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

సహాయక చర్యల్లో 40 వేల మంది
గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి వరద సహాయక చర్యల్లో 40 వేల మందికిపైగా అధికారులు, సిబ్బంది పాలు పంచుకుంటున్నారు. ఇంతకుముందు వరదలు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో సహాయక చర్యలకు యంత్రాంగాన్ని వినియోగించిన దాఖలాలు లేవు. కానీ ఈసారి వరద హెచ్చరికలు మొదలైనప్పటి నుంచి సీఎం సహా ప్రభుత్వ యంత్రాంగమంతా హుటాహుటిన అప్రమత్తమైంది. ఆరు జిల్లాల్లో ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జాయింట్‌ కలెక్టర్లు, ఆరుగురు ఎస్పీలు పక్కా ప్రణాళికతో వరద విపత్తును ఎదుర్కొన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది కలిసి 1,235 మంది విధుల్లో పాలు పంచుకుంటున్నారు.

గ్రామ సచివాలయ సిబ్బంది 8,960 మంది, గ్రామ వలంటీర్లు 13,241 మంది, పారిశుధ్య సిబ్బంది 2,650 మంది, వైద్య సిబ్బంది 1,294 మంది, బోట్ల డ్రైవర్లు, సహాయకులు 631 మంది ప్రత్యక్షంగా వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వీరంతా కలిపి మొత్తం 28,029 మంది సహాయక చర్యల్లో అలుపు లేకుండా పనిచేస్తున్నారు. వీరుకాకుండా పోలీసులు, ఫైర్‌ సర్వీసెస్, పశు సంవర్థక, ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్‌ తదితర శాఖల అధికారులు, సిబ్బంది మరో 10 వేల మందికిపైగా సహాయక చర్యల్లో నిరంతరాయం సేవలు అందిస్తున్నారు.

మరోవైపు రాష్ట్ర స్థాయిలో విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో నడిచే స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి విపత్తుల నిర్వహణ సంస్థ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ సాయిప్రసాద్, ఎండీ అంబేడ్కర్‌తో కలిసి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ కలెక్టర్లు, యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇలా సీఎం నుంచి గ్రామ వలంటీర్‌ వరకు వరద సహాయక చర్యల్లో నిమగ్నమై పనిచేయడంతో ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు.  

మరిన్ని వార్తలు