‘కృష్ణా’లో స్థిరంగా వరద ఉధృతి

14 Aug, 2022 03:45 IST|Sakshi
శ్రీశైలం నుంచి దిగువకు కృష్ణమ్మ పరవళ్లు

కృష్ణా నది నుంచి శ్రీశైలం, సాగర్, పులిచింతల్లోకి వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు విడుదల

ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 4.02 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి

నేడూ శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజ్‌ వరకూ ఇదే రీతిలో కొనసాగనున్న వరద

గోదావరిలో వరద తగ్గుముఖం.. 

సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/విజయపురిసౌత్‌ (మాచర్ల)/అచ్చంపేట/పోలవరం రూరల్‌: పరీవాహక ప్రాంతంలో ఎగువన ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతుండగా గోదావరిలో క్రమంగా తగ్గుతోంది. జూరాల నుంచి కృష్ణా, సుంకేశుల నుంచి తుంగభద్ర ద్వారా శనివారం సా.6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,25,563 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 14 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం ద్వారా 30,252, ఎడమ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టులో 884.3 అడుగుల్లో 211.47 టీఎంసీలను నిల్వచేస్తూ.. పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,76,170 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. 

సాగర్‌లోకి 4.09 లక్షల క్యూసెక్కులు
అలాగే, నాగార్జునసాగర్‌లోకి 4,09,963 క్యూసెక్కులు చేరుతుండగా.. 586.3 అడుగుల్లో 301.87 టీఎంసీలను నిల్వచేస్తూ.. 3,58,120 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల్లోకి 3,77,117 క్యూసెక్కులు చేరుతుండగా.. 168.01 అడుగుల్లో 35.59 టీఎంసీలను నిల్వచేస్తూ.. 17 గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 3,40,827 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇక పులిచింతల నుంచి దిగువకు వదిలేస్తున్న నీటికి పాలేరు, మున్నేరు వరద తోడవుతుండడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 4,15,036 క్యూసెక్కులు చేరుతోంది.

మిగులుగా ఉన్న 4,02,944 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంలో ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి వచ్చిన నీటిని వచ్చిట్లుగా 2.30 లక్షల క్యూసెక్కులను, తుంగభద్ర డ్యామ్‌ నుంచి 1.05 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లలోకి ఇదే రీతిలో వరద కొనసాగనుంది.

గోదావరిలో క్రమంగా తగ్గుముఖం
మరోవైపు.. గోదావరిలోనూ వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఆదివారం నాటికి మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 52 అడుగుల్లో కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టులోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో శనివారం రాత్రి 9 గంటలకు ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటి మట్టం 14.90 అడుగులకు చేరింది. మిగులుగా ఉన్న 14,74,377 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. 

మరిన్ని వార్తలు