ఫ్లోరైడ్‌ తగ్గింది.. నీటి నాణ్యత పెరిగింది

18 Oct, 2021 03:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రవ్యాప్తంగా 1.80 లక్షల నీటి నమూనాల పరీక్ష

కేవలం 3.5 శాతం నమూనాల్లో ఫ్లోరైడ్, ఇతర కాలుష్య కారకాలు ఉన్నట్టు గుర్తింపు

గతంలో 15 శాతం నమూనాల్లో ఫ్లోరైడ్, కాలుష్య కారకాలు

సమృద్ధిగా వర్షాలు, ప్రభుత్వ చర్యలతో తాగునీటి నాణ్యత మెరుగుదల

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించే బోరు బావుల్లో నీటి నాణ్యత గతం కంటే బాగా మెరుగుపడినట్టు తేలింది. ప్రత్యేకించి గ్రామాల్లో ప్రజలకు తాగునీటి కోసం వినియోగించే వివిధ రకాల నీటి వనరులకు అధికారులు పరీక్షలు నిర్వహించగా.. ఫ్లోరైడ్‌ తదితర కాలుష్య కారకాలు అతి తక్కువ చోట్ల ఉన్నట్టు స్పష్టమైంది. తాగునీటి అవసరాలకు ఉపయోగించే వనరులలోని నీటికి గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) అధికారులు ఏటా వర్షాకాలం ప్రారంభంలో ఒకసారి, ఆరు నెలల తర్వాత మరోసారి తప్పనిసరిగా నాణ్యత పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు ఆరున్నర నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వివిధ చోట్ల మొత్తం 1,80,608 నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేయించారు.

వాటిలో  6,432 నీటి నమూనాల్లో ఫ్లోరైడ్‌ లేదా ఇతర ప్రమాదకర కాలుష్యాలు ఉన్నట్టు తేలింది. అంటే మొత్తం పరీక్షలలో కేవలం 3.5 శాతం నీటి నమూనాలలోనే కాలుష్య కారకాలను గుర్తించారు. గతంలో వివిధ సంవత్సరాల్లో  గ్రామీణ ప్రాంతాల్లో సేకరించిన నీటి నమూనాల్లో 15 శాతానికి పైగా ఫ్లోరైడ్‌ వంటి కారకాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు నిర్ధారణ అయిన సందర్భాలు ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6,432 చోట్ల కాలుష్య కారకాలను గుర్తించగా.. వాటిలో 6,396 చోట్ల వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు కూడా పూర్తి చేసినట్టు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులు వెల్లడించారు. గత రెండేళ్లగా సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భ జలమట్టాలు పెరగడం, సురక్షిత తాగునీటి సరఫరా విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల వల్ల రాష్ట్రంలో కలుషిత నీటి జాడలు బాగా తగ్గినట్టు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చెప్పారు.

పరీక్షల్లో మన రాష్ట్రమే టాప్‌
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ముందే నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించడంలో మన రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 1,99,785 నీటి నమూనాలు సేకరించి, వాటిలో 1,80,608 నమూనాలకు నాణ్యత పరీక్షలు నిర్వహించారు. దేశంలో మరే రాష్ట్రం లక్షన్నర నీటి నమూనాలకు మించి పరీక్షలు నిర్వహించలేదు. ఏపీ తర్వాత మధ్యప్రదేశ్‌ 1.49 లక్షల నీటి నమూనాలను సేకరించి, అందులో 1.26 లక్షల నమూనాలకు పరీక్షలు నిర్వహించి రెండో స్థానంలో ఉంది. 

మరిన్ని వార్తలు