AP: రాష్ట్రంలో ఫ్లోరైడ్‌ తగ్గుముఖం

14 Dec, 2021 07:52 IST|Sakshi

35 మండలాల్లో పూర్తిగా తొలగిపోయిన ఫ్లోరైడ్‌ భయం 

ఫ్లోరైడ్‌ సమస్య లేని జిల్లాగా విజయనగరం

12 జిల్లాల్లో అక్కడక్కడ ఫ్లోరైడ్‌ ఆనవాళ్లు

రాష్ట్రంలో 98 మండలాల్లో ఫ్లోరైడ్‌ సమస్య

రాయలసీమలో ఫ్లోరైడ్‌ సమస్య నుంచి బయటపడ్డ 52 మండలాలు

భూగర్భ జల పరీక్షల్లో నిర్ధారణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత మూడేళ్లలో ఫ్లోరైడ్‌ బాగా తగ్గుముఖం పట్టింది. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలశాఖ అధికారులు 2018 మే, నవంబర్‌ల్లో పరీక్షలు నిర్వహించారు. ఇందులో 660 మండలాలకుగాను 133 మండలాల్లో బోర్లు, బావుల్లో ఫ్లోరైడ్‌ ఉన్నట్టు గుర్తించారు. అయితే అక్కడి నీరు ప్రజలు తాగునీటికి ఉపయోగించడానికి వీలుగానే ఉందని తేల్చారు. కాగా, ఈ ఏడాది నిర్వహించిన నీటి పరీక్షల్లో కేవలం 98 మండలాల్లోనే ఫ్లోరైడ్‌ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు నిర్ధారించారు.

35 మండలాల్లో ఫ్లోరైడ్‌ భయాలు పూర్తిగా తొలగిపోయాయి. భూగర్భ జల శాఖ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో 1,259 బోర్లు, బావులను ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని.. ఏటా ఆ నీటిలో వచ్చే మార్పులను గుర్తించేందుకు నీటి పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రతి మండలంలో ఖచ్చితంగా ఒక బోరు లేదంటే బావిని నీటి నాణ్యత పరీక్షల కోసం ఎంపిక చేసుకుంటోంది. కొన్ని మండలాల్లో అక్కడి నైసర్గిక స్వరూపం, స్థానిక పరిస్థితుల ఆధారంగా రెండు, మూడింటిలో కూడా పరీక్షలు చేసింది. ఏటా వర్షాకాలం ప్రారంభానికి ముందు, ముగిశాక నవంబర్‌లో ఆ 1,259 బోర్లు, బావుల నీటిని సేకరించి, నాణ్యతను విశ్లేషిస్తోంది. 

ఫ్లోరైడ్‌ ఎంత ఉండాలంటే..
గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) అధికారుల లెక్కల ప్రకారం.. ఒక లీటరు నీటిలో ఒక మిల్లీగ్రాము, అంతకంటే తక్కువగా ఫ్లోరైడ్‌ ఆనవాళ్లు ఉంటే ఆ నీటిని తాగునీటికి ఉపయోగించవచ్చు. దీన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక లీటరు నీటిలో 1.5 మిల్లీగ్రాముల పరిమాణంలో ఫ్లోరైడ్‌ ఉన్నా తాగునీటికి ఉపయోగించుకోవచ్చని సవరించింది. 1.5 మిల్లీగ్రాములకు మించి ఫ్లోరైడ్‌ ఉన్న నీరు తాగునీటికి పనికిరాదు.

రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ అధికారుల వివరాల ప్రకారం.. 2018లో ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరులోని బోర్లు, బావుల్లో 1.58 మిల్లీగ్రాముల పరిమాణంలో ఫ్లోరైడ్‌ ఆనవాళ్లు ఉన్నాయి. తాజాగా ఆ గ్రామంలో నిర్వహించిన పరీక్షల్లో ఫ్లోరైడ్‌ ఒక మిల్లీగ్రాము లోపునకే పరిమితమైనట్టు గుర్తించారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండల కేంద్రంలోని బోరుబావుల నీటిలో మూడేళ్ల కిత్రం 2.55 మిల్లీగ్రాముల పరిమాణంలో ఫ్లోరైడ్‌ ఉన్నట్టు గుర్తించగా.. తాజా పరీక్షల్లో ఆ గ్రామంలో ఫ్లోరైడ్‌ 1.90 మిల్లీ గ్రాములకు పరిమితమైనట్టు తేల్చారు. 

విజయనగరం జిల్లా మినహా..
భూగర్భ జల శాఖ అధికారుల తాజా గణాంకాల ప్రకారం.. విజయనగరం జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య లేదు. రాష్ట్రంలో మిగిలిన 12 జిల్లాల పరిధిలో అక్కడక్కడా భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్‌ ప్రమాదకర పరిమాణంలో ఉంది. 12 జిల్లాల్లోని 98 మండలాల పరిధిలో అత్యధికంగా అనంతపురం, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో ఫ్లోరైడ్‌ సమస్య ఉన్నట్టు తేలింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 21, ప్రకాశం జిల్లాలో 17, వైఎస్సార్‌ జిల్లాలో 15 మండలాల్లో ఫ్లోరైడ్‌ సమస్య ఉన్నట్టు స్పష్టమైంది. మరోవైపు.. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కేవలం ఒక్కో మండలంలో, తూర్పుగోదావరి జిల్లాలో మూడు, విశాఖపట్నం జిల్లాలో నాలుగు మండలాల్లో ఫ్లోరైడ్‌ సమస్య ఉన్నట్టు తేలింది.

సీమలో తగ్గి కోస్తా జిల్లాల్లో పెరుగుదల..
గత మూడేళ్ల కాలంలో రాయలసీమలో ఏకంగా 52 మండలాలు ఫ్లోరైడ్‌ నుంచి బయటపడినట్టు భూగర్భ జల శాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో కోస్తా జిల్లాల్లోని 17 మండలాల్లో నిర్ణీత పరిమాణం కంటే పాక్షికంగా ఫ్లోరైడ్‌ ప్రభావం పెరిగింది. భూగర్భ జలమట్టంలో హెచ్చుతగ్గుల కారణంగా ఫ్లోరైడ్‌ పరిమాణంలో మార్పులు కనిపిస్తుంటాయని అధికారులు తెలిపారు. భూమి లోతుకు వెళ్లేకొద్దీ ఫ్లోరైడ్‌ నీటితో కలిసి బయటకు వస్తుందన్నారు. వర్షాలు ఎక్కువగా కురిసిన సమయాల్లో తక్కువ లోతులోనే నీరు అందుబాటులో ఉండటం వల్ల ఆ నీటిలో ఫ్లోరైడ్‌ శాతం తక్కువగా ఉంటుందని వివరించారు.

మరిన్ని వార్తలు