వైఎస్సార్‌ కంటి వెలుగు మూడో విడతపై దృష్టి 

7 Jan, 2023 08:22 IST|Sakshi

మే చివరికి పూర్తి చేసేలా చర్యలు

ఇప్పటికే 22 లక్షల మంది వృద్ధులకు స్క్రీనింగ్‌

రెండు విడతల్లో 66.17 లక్షల మంది

విద్యార్థులకు నేత్ర పరీక్షలు

1.58 లక్షల మందికి కళ్లద్దాల పంపిణీ

సాక్షి, అమరావతి: డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం మూడో విడతను ఈ ఏడాది మే నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్దేశించుకున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అదనంగా స్క్రీనింగ్‌ బృందాలను సమకూర్చడం లాంటి అంశాలపై దృష్టి సారించారు. సామూహిక కంటి పరీక్షల ద్వారా 5.60 కోట్ల మంది ప్రజల్లో నేత్ర సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆరు దశల్లో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ  కంటి పరీక్షలు నిర్వహించే ప్రణాళిక రూపొందించారు. 

తొలి రెండు దశల్లో ఇలా 
తొలి రెండు దశల్లో 60,393 పాఠశాలల్లో 66,17,613 మంది విద్యార్థులకు కంటి సమస్యలు గుర్తించేందుకు స్క్రీనింగ్‌ నిర్వహించారు. నేత్ర సమస్యలతో బాధపడుతున్న 1,58,227 మందికి ప్రభుత్వం ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేసింది. 310 మంది విద్యార్థులకు కేటరాక్ట్‌ సర్జరీలు చేశారు. కంటి వెలుగు ద్వారా అత్యధికంగా బీసీ సామాజిక వర్గాలకు చెందిన 34 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. ఇతర విద్యార్థుల్లో ఓసీలు 14.42 లక్షలు, ఎస్సీలు 13.17 లక్షలు, ఎస్టీలు 4.50 లక్షల మంది ఉన్నారు.  

మూడో విడతలో 56.88 లక్షల మందికి స్క్రీనింగ్‌ 
రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన 56,88,424 మంది వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించేలా మూడో విడత కార్యక్రమాన్ని 2020 ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఇప్పటి వరకూ 22,91,593 మందికి పరీక్షలు చేశారు. వీరిలో 10,91,526 మందికి మందుల ద్వారా నయం చేయవచ్చని గుర్తించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 10,21,007 మందికి కళ్లద్దాలు అవసరం కాగా 8.50 లక్షల మందికి పంపిణీ పూర్తైంది. 1,66,385 మంది వృద్ధులు శుక్లాలతో బాధ పడుతున్నట్టు గుర్తించి ఉచితంగా సర్జరీలు నిర్వహిస్తోంది. 

వేగంగా పూర్తయ్యేలా అదనపు బృందాలు
వృద్ధులందరికి కంటి పరీక్షలు వేగంగా పూర్తి చేసేలా ప్రతివారం సమీక్ష నిర్వహిస్తున్నాం. మే నెలాఖరులోగా మూడో విడత పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాం. ఐదు నెలల్లో 33.96 లక్షల మంది స్క్రీనింగ్‌కు వీలుగా అదనపు బృందాలను నియమిస్తాం. పీఎంవోవో/పీఎంవోఏ రోజుకు 60 మందిని స్క్రీనింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌లు స్క్రీనింగ్, కళ్లద్దాల పంపిణీ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారు. పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్లు తమ పరిధిలో రోజువారి స్క్రీనింగ్‌ కార్యక్రమాలను పర్యవేక్షించాలి.  
– డాక్టర్‌ యాస్మిన్, డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు రాష్ట్ర ప్రత్యేకాధికారి    

మరిన్ని వార్తలు