రూ.200 బిర్యానీ తిన్న పాపానికి ఆసుపత్రి బిల్లు ఎంతయిందో తెలుసా..?

23 Dec, 2021 10:49 IST|Sakshi

కల్తీ సరుకులతో ఆహార పదార్థాలు 

ప్రమాదకర రంగుల వినియోగం

మెజారిటీ హోటళ్లలో కల్తీ నూనెలతోనే వంటకాలు  

ఆస్పత్రి పాలవుతున్న జిల్లా వాసులు 

తనిఖీలపై దృష్టి సారించని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు 

సిబ్బంది కొరత సాకుతో జనం ప్రాణాలతో ఆటలు

Food Adulteration Impact On Health: అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉంటున్న రాము మూడు రోజుల కిందట ఓ హోటల్‌లో బిర్యానీ కొన్నాడు. మధ్యాహ్నం వేళ ఇంటికెళ్లి ఆవురావురుమంటూ తినేశాడు. సాయంత్రానికి వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఆస్పత్రికి వెళ్లగా పరీక్షించిన వైద్యులు ఫుడ్‌ పాయిజన్‌గా తేల్చారు. రోజుల తరబడి నిల్వ ఉన్న మాంసం... కలర్‌ కోసం వాడిన రంగుల వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లు చెప్పారు. రూ.200 బిర్యానీ తిన్న పాపానికి రూ.2 వేలు ఆస్పత్రి బిల్లు కట్టి బయటపడ్డాడు. ఇలాంటి కేసులు జిల్లాలో ఎన్నో వెలుగు చూస్తున్నాయి. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు తమ ఉద్యోగాన్నే మరిచిపోవడంతో... వ్యాపారులు డబ్బు కోసం జనం ప్రాణాలతో ఆటలాడుతున్నారు. 

సాక్షి, అనంతపురం: జిల్లాలో ఆహార భద్రత నియంత్రణ శాఖ నిద్ర మత్తులో జోగుతోంది. ఇబ్బడి ముబ్బడిగా కల్తీ ఆహారం సరఫరా అవుతున్నా తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తోంది. ముగ్గురు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్నా...వారు ఎక్కడున్నారో...ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. జిల్లా ఫుడ్‌కంట్రోల్‌ అధికారిగా మరో జిల్లాకు చెందిన అధికారి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎప్పుడొస్తారో.... ఎప్పుడు వెళతారో కూడా అంతుబట్టడం లేదు. దీంతో ఏ హోటళ్లలో ఎలాంటి ఆహారం వండి వడ్డిస్తున్నారన్న దాని గురించి ఆరా తీసే నాథుడే లేకుండా పోయారు. దీంతో వ్యాపారులు ఆహార ప్రియులను ఆకర్షించడానికి ప్రమాదకర రంగులు వాడుతూ జనం ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. 

కల్తీ జోరు...చర్యలు తీసుకునే వారే లేరు 
ఇటీవల పప్పులు మొదలుకొని నూనెల వరకూ అన్నీ కల్తీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కల్తీపై నిఘా వేసి జనాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. వాస్తవంగా వండిన ఏ ఆహారమైనా ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు ర్యాండమ్‌గా నమూనాలు తీయాలి. ఆహార పదార్థాలపై ఆర్సెనిక్‌ (క్యాన్సర్‌ కారక) ప్రభావం ఉన్న రంగులు వేస్తే వాటిపై చర్యలు తీసుకోవాలి. టీపొడి నుంచి పాల వరకూ ఇలా ప్రతి ఒక్కదానిపైనా నాణ్యతను పరిశీలించడం, ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలి.

చదవండి: (Neem Tree: వెయ్యి జబ్బులను నయం చేసే.. వేప చెట్టుకు ఆపదొచ్చింది) 

ఈ క్రమంలో ఒక్కో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ నెలకు కనీసం 12 నమూనాలు తీసి ఎఫ్‌ఎస్‌ఎల్‌ (ఫుడ్‌సేఫ్టీ ల్యాబొరేటరీ)కి పంపించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం కల్తీ అయినట్లు నిర్ధారణ అయితే కేసులు నమోదు చేయడంతో పాటు తీవ్రతను బట్టి సదరు హోటల్‌ను సీజ్‌ చేసే అధికారం కూడా వారికి ఉంటుంది. కానీ జిల్లాలో ఒక్క కేసూ నమోదు కావడం లేదు. అసలు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారన్న విషయం కూడా ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. 

మూడు వేల షాపుల పైనే 
జిల్లాలో చిన్న చిన్న బడ్డీ కొట్ల నుంచి  మోస్తరు హోటళ్ల  వరకు దాదాపు 3 వేలు ఉన్నాయి. ఇందులో చాలా వాటిని మున్సిపాలిటీ లైసెన్సు గానీ, ట్రేడ్‌ లైసెన్సు గానీ లేకుండానే నడిపిస్తున్నారు.. గంటల తరబడి మరిగించిన నాసిరకం నూనెల్లో వేయించిన చిప్స్‌ అమ్ముతున్నారు. వీటిపై మాన్యుఫాక్చరింగ్‌ తేదీలుగానీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) లోగోలు గానీ ఉండవు. అయినప్పటికీ వీటిపై చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఎక్కడా కనిపించడం లేదు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఐపీఎం (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌) పరిధిలో ఉంటారు. వీరిపై  ఐపీఎం డైరెక్టర్‌ చర్యలు తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు.

చదవండి: (విటమిన్‌ ‘డి’ లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!) 
 
ధర తక్కువ...కల్తీ ఎక్కువ 
►కిలో వంటనూనె, కిలో క్రీమ్‌పౌడర్‌ను బాగా కలిపి మిక్సీలో వేసి తిప్పితే 10 లీటర్ల నకిలీ పాలు తయారవుతాయి. లీటర్‌ రూ.40 అమ్మినా రూ.400 సొమ్ము చేసుకోవచ్చు. 
►స్వచ్ఛమైన నెయ్యి కిలో రూ.600 నుంచి రూ.800 వరకూ అమ్ముతున్నారు. కానీ కొందరు కిలో రూ.120 అమ్ముతున్నారు. ఇదెలా సాధ్యమంటే పామాయిల్‌లో నెయ్యి వాసన వచ్చే పదార్థాలను కలిపి తయారు చేస్తున్నారు. ఇదేమీ తెలియని జనం ఎగబడి కొంటున్నారు.  
►గ్లూకోన్‌డీ పౌడర్‌ పేరుతోనూ చిన్నారుల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. రసాయనాల మిశ్రమం, తియ్యగా ఉండేందుకు శాక్రిన్‌ కలిపి మల్టీ నేషనల్‌ కంపెనీ కంటే అద్భుత ప్యాకింగ్‌లో మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. ఇది తాగితే చాలా ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. 
►చికెన్‌ 65, చిల్లీ చికెన్‌ పేరు చెప్పగానే మాంసాహార ప్రియులకు నోరూరుతుంది. కానీ తింటే ఆస్పత్రి పాలు కావాల్సి వస్తోంది. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్లపై బండ్లలో విక్రయించే వారు మిగిలి పోయిన మాంసాన్ని రోజుల తరబడి నిల్వ చేస్తున్నారు. దానికి ఆర్సెనిక్‌ కారక రసాయనాలు చల్లి ఆర్డర్‌ రాగానే వండి వారుస్తున్నారు. ఫలితంగా దీన్ని తిన్న వారు ఆనారోగ్యం బారిన పడుతున్నారు. 
►పప్పు దినుసుల్లోనూ కల్తీ జరుగుతోంది. కిలో శనగపప్పులో 250 గ్రాముల బియ్యాన్ని కలిపి నేరుగా మెషిన్‌ ఆడిస్తారు. ఈ విషయం ఇటీవలే అధికారుల దృష్టికి వచ్చింది. 

ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఇద్దరే ఉన్నారు 
మా వద్ద ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఇద్దరే ఉన్నారు. అందుకే అనంతపురంలో ఆహార నమూనాలు సేకరించడం లేదు. జనవరిలో పోస్టులు భర్తీ అవుతాయని చెప్పారు. కొత్తగా సిబ్బంది వస్తే నమూ నాలు తీస్తాం. నేను కూడా ఇన్‌చార్జిగా ఉన్నాను. 
–శ్రీనివాసులు, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ (ఇన్‌చార్జ్‌) 
 

నా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటా  
ఏదైనా ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం. అనంతపురం జిల్లాలో నమూనాలు తీసే విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటాం. 
–డా.మంజరి, డైరెక్టర్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌   

మరిన్ని వార్తలు