అన్నదాత నుంచే ఆలయాలకు ఆహార ధాన్యాలు

11 Aug, 2022 04:04 IST|Sakshi
సమావేశంలో దేవదాయ శాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్, మార్క్‌ఫెడ్‌ ఎండీ ప్రద్యుమ్న, రైతు సాధికార సంస్థ సీఈవో రామారావు

11 గుళ్లలో ప్రసాదాలు, అన్నదానానికి వినియోగం

సేంద్రియ విధానంలో పండించే ఆహార ధాన్యాలు కొనుగోలు 

12 రకాలు.. ఏటా 8 వేల టన్నులు కొనుగోలు  

పురుగుమందుల ఆనవాళ్లు లేని ప్రసాదాలే భక్తులకు పంపిణీ 

ఆలయాల ఈవోలతో దేవదాయ శాఖ, మార్క్‌ఫెడ్‌ అధికారుల సమావేశం

మరో వారంలో ఆలయాల పాలకమండళ్లలో తీర్మానాలు 

మలి దశలో 175 ఆలయాల్లో అమలు

ఇప్పటికే టీటీడీలో 24 వేల టన్నుల శనగలు కొనుగోలు

సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాల్లో పురుగుమందుల ఆనవాళ్లు లేని ప్రసాదాలు, అన్న ప్రసాదాన్ని భక్తులకు అందించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం సేంద్రియ పద్ధతిలో పండించే రైతుల నుంచి నేరుగా ఆహార ధాన్యాలు కొనాలని నిర్ణయించింది. ప్రసాదాలు, అన్నదానంలో ఉపయోగించే 12 రకాల ఆహార ధాన్యాలను దేవదాయ శాఖ రైతుల నుంచి కొంటుంది. వీటి కొనుగోలులో మార్క్‌ఫెడ్‌ మధ్యవర్తిత్వం వహిస్తుంది. తొలుత 11 ప్రధాన ఆలయాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ అంశంపై ఇంతకు ముందే ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిల స్థాయిలో ప్రాథమిక చర్చలు జరిగాయి.

బుధవారం ఆలయాల ఈవోలతో  దేవదాయ శాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్, మార్క్‌ఫెడ్‌ ఎండీ ప్రద్యుమ్న, రైతు సాధికార సంస్థ సీఈవో రామారావు సమావేశమయ్యారు. తదుపరి దశలో ఆయా ఆలయ పాలక మండలి సమావేశాల్లో రైతుల నుంచే సేంద్రియ ఆహార ధాన్యాల కొనుగోలుపై చర్చించి, ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని దేవదాయ శాఖ వర్గాలు తెలిపాయి. తదుపరి దశలో నిత్య అన్నదానం జరిగే మరో 175 ఆలయాల్లో ఈ విధానం అమలుకు కసరత్తు జరుగుతోంది. రైతులకు కేవలం 15 రోజుల్లోనే డబ్బు చెల్లించాలని కూడా దేవదాయ శాఖ భావిస్తోంది. 

ఆ 11 ఆలయాలకే ఏటా 8 వేల టన్నుల ఉత్పత్తులు 
శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, పెనుగంచిప్రోలు, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, వాడపల్లి, విశాఖ కనకమహాలక్ష్మీ ఆలయం, మహానంది ఆలయాల్లో ముందుగా ఈ విధానాన్ని ప్రవేశ పెడుతున్నారు. ఈ ఆలయాల్లో ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలకు ఏటా దాదాపు 8 వేల టన్నుల ఆహార ధాన్యాలు అవసరం ఉంటుందని అంచనా. రెండు దశలో చేపట్టే 175 ఆలయాలకు 35 – 40 వేల టన్నుల ఆహార ధాన్యాల అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సాధారణ పురుగు మందులు ఉపయోగించి పండించే ఆహార ధాన్యాలకు బదులు సేంద్రియ పద్ధతిలో పండించిన ధాన్యం వినియోగం ద్వారా భక్తులకు మరింత నాణ్యమైన ప్రసాదం అందించవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయ విధానానికి ప్రభుత్వ పరంగానూ అదనపు ప్రోత్సాహం అందించినట్టవుతుందని చెప్పారు.

టీటీడీలో సేంద్రియ శనగల కొనుగోలు 
తిరుమల తిరుమల దేవస్థానం (టీటీడీ)లో ప్రసాదాల తయారీలో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు పరుస్తున్నారు. టీటీడీలో ఏటా 24 వేల టన్నుల ఆహార ధాన్యాలు వినియోగిస్తారు. వీటిలో శనగలను మార్కెఫెడ్‌ మధ్యవర్తిత్వంతో సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల నుంచి నేరుగా కొంటున్నారు.  మిగతా ఆహార ధాన్యాలను కూడా సేంద్రియ పద్ధతిలో పండించే రైతుల నుంచి కొనాలన్న ప్రక్రియ పురోగతి దశలో ఉంది.   

మరిన్ని వార్తలు