ఏపీకి రూ.1,975 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

6 Mar, 2021 04:42 IST|Sakshi

15 నెలల కాలానికి గణాంకాలు విడుదల 

దేశవ్యాప్తంగా సేవా, సాఫ్ట్‌వేర్‌ రంగంలో అధికంగా పెట్టుబడులు 

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు అక్టోబరు 2019 నుంచి డిసెంబరు 2020 మధ్య పదిహేను నెలల కాలానికి రూ.1,975 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయి. ఇందుకు సంబంధించిన గణాంకాలను పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) విడుదల చేసింది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం రూ. 5,54,613.65 కోట్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఇందులో 31.92 శాతంతో గుజరాత్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఏకంగా రూ.1,77,052 కోట్ల మేర ఈ రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. రూ.1,53,351 కోట్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. మొత్తం ఎఫ్‌డీఐలో మహారాష్ట్ర వాటా 27.65 శాతంగా ఉంది. అలాగే, రూ.78,159 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి కర్ణాటక మూడో స్థానంలో.. రూ.59,830 కోట్లతో ఢిల్లీ నాలుగో స్థానంలో, రూ.19,733 కోట్లతో తమిళనాడు ఐదో స్థానంలో నిలిచాయి. రూ.11,331.61 కోట్ల మేర ఎఫ్‌డీఐలతో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. ఇది మొత్తం ఎఫ్‌డీఐల్లో 2.4 శాతంగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ రూ.1,975 కోట్ల ఎఫ్‌డీఐలతో 12వ స్థానంలో నిలిచింది. ఐటీ రంగం విస్తరించిన హైదరాబాద్‌.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు వెళ్లిపోవడంతో ఎఫ్‌డీఐల రాక కూడా అక్కడే కేంద్రీకృతమై ఉన్నట్లు అవగతమవుతోంది.  

మారిషస్‌ నుంచే అత్యధికం 
కాగా, గడిచిన 20 ఏళ్లలో 2000 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు 2020 వరకు దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐల్లో 28 శాతం మారిషస్‌ నుంచే ఉన్నాయి. తదుపరి 22 శాతం సింగపూర్‌ నుంచి వచ్చాయి. అమెరికా నుంచి 8 శాతం, నెదర్లాండ్స్‌ నుంచి 7 శాతం, జపాన్‌ నుంచి 7 శాతం, యూకే నుంచి 6 శాతం ఉన్నాయి. అయితే, ఇటీవలి సంవత్సరాల్లో సింగపూర్, యూఎస్‌ఏ, కేమన్‌ ఐలాండ్స్, యూఏఈల నుంచి అత్యధికంగా ఎఫ్‌డీఐలు వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు సింగపూర్‌ నుంచి రూ.1,16,812 కోట్లు, యూఎస్‌ఏ నుంచి రూ. 95,246 కోట్లు, యూఏఈ నుంచి రూ. 29,149 కోట్లు, కేమన్‌ ఐలాండ్స్‌ నుంచి రూ. 18,842 కోట్లు వచ్చాయి.  

సేవ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లోనే అత్యధికం 
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సేవా రంగంలోనే అత్యధికంగా వస్తున్నాయి. ఫైనాన్షియల్, బ్యాంకింగ్, నాన్‌–ఫైనాన్షియల్, ఔట్‌సోర్సింగ్, పరిశోధన–అభివృద్ధి, కొరియర్, టెక్నాలజీ, టెస్టింగ్‌ అండ్‌ అనాలసిస్‌ తదితర సేవలు అందించే ఈ రంగానికి 16 శాతం ఎఫ్‌డీఐలు రాగా, కంప్యూటర్స్‌ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ పరిశ్రమలోకి 13 శాతం పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ పరిశ్రమలోకి ఏకంగా> రూ.1,81,470 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ రెండు రంగాల తరువాత వరుసగా టెలికమ్యునికేషన్లు (7 శాతం), ట్రేడింగ్‌ (6 శాతం), భవన నిర్మాణ రంగం (5 శాతం), ఆటోమొబైల్స్‌ ఇండస్ట్రీ (5 శాతం), మౌలిక వసతుల నిర్మాణ రంగం (5 శాతం), రసాయనాలు (4 శాతం), ఫార్మాస్యూటికల్స్‌ (3 శాతం), హోటల్, టూరిజం (3 శాతం) రంగాలు నిలిచాయి.  

మరిన్ని వార్తలు