గ్లోబల్‌ టెండర్లు: ఎవరూ ఆసక్తి చూపలేదు!

4 Jun, 2021 09:26 IST|Sakshi

గ్లోబల్‌ టెండర్లకు ముందుకు రాని విదేశీ వ్యాక్సిన్‌ కంపెనీలు

ఏపీ సహా పది రాష్ట్రాలు గ్లోబల్‌ టెండర్లకు..

కేంద్రానికే సరఫరా చేస్తామని, రాష్ట్రాల టెండర్లకు స్పందించరాదని విదేశీ కంపెనీల నిర్ణయం..

రాష్ట్రంలో గురువారం టెండర్లు ఓపెన్‌ చేయగా.. ఏ విదేశీ కంపెనీ ముందుకు రాలేదు  

సాక్షి, అమరావతి: రాష్ట్రాలకు నేరుగా వ్యాక్సిన్‌ సరఫరా చేసేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. దేశంలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్‌ టెండర్లకు వెళ్లిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం 5 గంటలకు ఈ టెండర్లు తెరవగా... ఏ కంపెనీ కూడా సరఫరాకు ముందుకు రాలేదని అధికారులు తెలిపారు. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండడం, రాష్ట్రం నేరుగా వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలన్నా ఎన్ని విక్రయించాలనేది కేంద్రమే కంపెనీలకు నిర్దేశిస్తుండటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలందరికీ త్వరగా వ్యాక్సిన్‌ ఇవ్వాలన్న తాపత్రయంతో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లకు వెళ్లింది. తర్వాత దేశంలోని పలు రాష్ట్రాలు ఏపీని అనుసరించి గ్లోబల్‌ టెండర్లు పిలిచాయి. అయితే కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే సరఫరా చేస్తామని, రాష్ట్రాల టెండర్లకు స్పందించకూడదని గ్లోబల్‌ కంపెనీలు నిర్ణయించుకున్న నేపథ్యంలో రాష్ట్రాలు పిలిచిన టెండర్లకు స్పందన రాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

ఏపీ బాటలో 9 రాష్ట్రాలు..
తొలుత ఆంధ్రప్రదేశ్‌ గ్లోబల్‌ టెండర్లకు వెళ్లగా, అదే బాటలో మరో తొమ్మిది రాష్ట్రాలు నడిచాయి. ఆ మేరకు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు వ్యాక్సిన్‌కోసం గ్లోబల్‌ టెండర్ల ద్వారా కంపెనీలను ఆహ్వానించాయి. అయితే ఉత్తరప్రదేశ్‌ టెండర్లకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జూన్‌ 10వ తేదీ వరకు గడువు పెంచింది. ముంబైలో డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే సరఫరా చేస్తామంటూ ముందుకొచ్చారు.

దీంతో ఆ రాష్ట్రం ఆసక్తిగా లేదు. కర్ణాటకలోనూ కేవలం డిస్ట్రిబ్యూటర్లే ముందుకు రావడంతో టెండరు రద్దు చేశారు. రాజస్థాన్‌లో టెండర్లకు ఎవరూ ముందుకు రాలేదు. ఒడిశాలోనూ ఇదే పరిస్థితి. దీంతో జూన్‌ 4 వరకు గడువు పెంచింది. కేరళ, తమిళనాడులో జూన్‌ 5 వరకు టెండర్లకు గడువుంది. తెలంగాణ శుక్రవారం టెండర్లు తెరవబోతోంది. ఢిల్లీలో మాత్రం ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌(ఆసక్తి వ్యక్తీకరణ) కింద నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇప్పటివరకూ గ్లోబల్‌ టెండర్లకు ఏ రాష్ట్రంలోనూ గ్లోబల్‌ కంపెనీలు ఆసక్తి చూపలేదు.

చదవండి: ఆనందయ్య మందు.. ‘ఔషధచక్ర’?  
వ్యాక్సినేషన్‌ పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకోవాలి: సీఎం జగన్‌  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు