అదిగో పులి... ఇదిగో తోక

2 Jul, 2022 11:34 IST|Sakshi

కోటవురట్ల: పులి భయంతో అటవీ పరిధి గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు అటవీ పరిధిలో సంచరించిన పులి తాజాగా నర్సీపట్నం–రేవుపోలవరం రోడ్డుపై కూడా సంచరిస్తోందన్న ప్రచారం సాగుతోంది. గురువారం రాత్రి ఇందేశమ్మవాక ఘాట్‌రోడ్డులో పలువురికి పులి కనిపించినట్టు చెబుతున్నారు. ఎస్‌.రాయవరం మండలం చినగుమ్ములూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వెళుతుండగా ఘాట్‌రోడ్డులో పులి కనిపించడంతో బైకును అక్కడే వదిలేసి వెనక్కి పరుగులు తీసినట్టు చెబుతున్నారు.

పందూరు గ్రామానికి చెందిన కిర్రా నాగేశ్వరరావు ఇందేశమ్మతల్లి ఆలయంలో ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ఎప్పటిలానే గురువారం రాత్రి 9 గంటల సమయంలో అమ్మవారికి దీపం పెట్టి తిరిగి పందూరులోని ఇంటికి వెళ్లేందుకు బయటకొచ్చి బైక్‌ స్టార్ట్‌ చేసేసరికి లైట్‌ వెలుతురులో సుమారు 200 అడుగుల దూరంలో పులి కొండపైకి ఎక్కుతూ కనిపించినట్టు నాగేశ్వరరావు చెబుతున్నారు. తాను స్పష్టంగా చూశానని, పులి తోక, కాళ్లు కనిపించాయని రోడ్డు నుంచి కొండపైకి ఎక్కుతుండడంతో భయపడి వెంటనే గుడిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నట్టు తెలిపాడు. మరికొద్ది సమయానికి అటుగా రెండు లారీలతో పాటు కొందరు యువకులు బైకులపై రావడంతో వారితో పాటు హారన్లు కొట్టుకుంటూ ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్నట్టు చెబుతున్నారు. 

అయితే ఇదంతా కేవలం వదంతులేనని ఫారెస్టు రేంజరు రాజుబాబు కొట్టిపారేస్తున్నారు. పులి కొండల్లో సంచరిస్తున్న మాట వాస్తవమేనని, ఘాట్‌రోడ్డుపైకి రావడం కేవలం వదంతులే అన్నారు. శ్రీరాంపురంలో దున్నపై దాడి జరిగిన ప్రాంతంలో ట్రాక్‌ కమెరాలు ఏర్పాటు చేశామని, ఆ పులి మళ్లీ అటువైపు రాలేదని తెలిపారు. ప్రస్తుతం దాని దిశ మార్చుకుని నక్కపల్లి, పాయకరావుపేట మండలాల వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. దున్నను వేటాడి ఆహారం తీసుకుని సుమారు 30 గంటలు దాటుతోందని, మళ్లీ అటాక్‌ చేసే అవకాశం ఉందన్నారు. దానిని బట్టి పులి ఆచూకీ తెలుసుకుని ఆ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమ సిబ్బంది, రెస్క్యూ టీమ్‌ అనుమానం వచ్చిన ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పులి పాదముద్రలు లభ్యం కావడం లేదన్నారు.  

సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం.. 
ఇందేశమ్మ వాక ఘాట్‌రోడ్డులో పులి తిరుగుతోందని అడ్డురోడ్డు నుంచి కోటవురట్ల వైపు ఎవరూ వెళ్లొద్దని గురువారం రాత్రి వాట్సప్‌ గూపుల్లో ప్రచారం జరిగింది. వేర్వేరు ప్రాంతాలల్లో పులి సంచరిస్తున్న వీడియోలను గ్రూపుల్లో అప్‌లోడ్‌ చేసి హడలెత్తిస్తున్నారు. దాంతో ఘాట్‌రోడ్డులో రాకపోకలు బాగా తగ్గిపోయాయి. అణుకు, అల్లుమియ్యపాలెం, రామచంద్రపురం, గూడెపులోవ, పందూరు, బంద, శ్రీరాపురం, తడపర్తి, బోనుకొత్తూరు గ్రామాలను పులిభయం వెంటాడుతోంది. ఒంటరిగా బైకులపై వెళ్లేందుకు భయపడుతున్నారు. 

అడవి వైపు వెళ్లొద్దు...
యలమంచిలి రూరల్‌ : రిజర్వ్‌ ఫారెస్ట్‌ను అనుకొని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆటవీశాఖ అధికారి రామ్‌ నరేష్‌ అన్నారు. శుక్రవారం పెదపల్లి అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వ్‌ ఫారెస్ట్‌లోకి పులి ప్రవేశించడంతో ప్రజలు ఒంటరిగా అడవిలోకి వెళ్లరాదన్నారు. అడవిని ఆనుకొని ఉన్న రైతులు పశువులను ఇంటికి తరలించడంతో పాటు అటు వైపు వెళ్లరాదని హెచ్చరించారు. పెదపల్లి రిజర్వాయర్, కొక్కిరాపల్లి రిజర్వాయర్‌ సమీపంలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండడంతో పాటు పశువులను గ్రామానికి తరలించాలని సూచించారు.

పులికి ఆహారం లభించు స్థలం, నీరు అందుబాటులో ఉన్న ప్రదేశాలను పరిశీలించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పెదపల్లి ఆటవీ శాఖ ప్రాంతంలోకి బెంగాల్‌ టైగర్‌ ప్రవేశించడంతో అటవీ శాఖ అధికారులు వెంకటపురం, పెదగొల్లలపాలెం, చిన గొల్లలపాలెంతో పాటు పలు గ్రామాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి ఆటవీ శాఖ అధికారులు రవి కుమార్, గోవిందు, ప్రభాకర్, మూర్తి పాల్గొన్నారు.  

(చదవండి: రైతులకు సిరులు కురిపిస్తోన్న పత్తి..)

మరిన్ని వార్తలు