కొల్లేరు పక్షుల లెక్క తేలింది 

29 Mar, 2023 05:35 IST|Sakshi

అభయారణ్యంలో ముగిసిన అటవీశాఖ పక్షుల గణన  

సాక్షి ప్రతినిధి, ఏలూరు : పక్షి ప్రేమికుల స్వర్గధామమైన కొల్లేరు అభయారణ్యంలో ఏషియన్‌ వాటర్‌ బర్డ్స్‌ సెన్సస్‌–2023 ముగిసింది. అటవీశాఖ సిబ్బంది 12 బృందాలుగా ఏర్పడి ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఈ నెలాఖరు వరకు ఏలూరు జిల్లాలో విస్తరించిన కొల్లేరు సరస్సు పరీవాహక ప్రాంతాల్లో పక్షుల గణన చేశారు.

అభయారణ్యం పరిధిలో వివిధ జాతులకు చెందిన 105 రకాల పక్షి జాతులను, 81,495 పక్షులను గుర్తించారు. వీటిలో మొదటి స్థానంలో కోయిలలు, రెండోస్థానంలో పెలికాన్‌ పక్షులు ఉండగా... అరుదైన పిన్‌టయల్‌ స్నిప్‌ (సూది తోక పుర్రెది) పక్షి ఒకటి, సిట్రిన్‌ వాగ్‌టయల్‌ (పసుపు తల జిట్టంగి) పక్షులు నాలుగు కనిపించాయి.   

పక్షుల గణన ఎలా చేశారంటే... 
పొడిసిపెడి ఫారమ్స్‌ (గ్రేబ్స్, నీటి ప్రయాణ పక్షులు), అన్సెరి ఫారŠమ్స్‌ (బాతులు), చరాద్రి ఫారమ్స్‌ (నీటి దగ్గర నివసించే పక్షులు), సికోని ఫారŠమ్స్‌ (కొంగజాతి పక్షులు), చిత్తడి నేలలపై ఆధారపడే పక్షులు... ఇలా ఐదు కుటుంబ కేటగిరీలుగా తీసుకుని పక్షుల గణన చేశారు. పక్షి నిపుణుడు, రికార్డింగ్‌ చేసే వ్యక్తి, ఫొటోగ్రాఫర్, గైడ్‌తోపాటు మరో ముగ్గురు కలిసి మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన 12 బృందాలు ఈ సర్వే చేశాయి. 

105  కొల్లేరు అభయారణ్యంలో గుర్తించిన పక్షిజాతులు 

7,875  అత్యధికంగా గుర్తించిన కోయిలల సంఖ్య 

81,495 ప్రస్తుతం ఉన్న మొత్తం పక్షులు 

6,869  రెండోస్థానంలో ఉన్న పెలికాన్‌ పక్షుల సంఖ్య 

తక్కువగా కనిపించిన పక్షులు 
ఈ సర్వేలో పిన్‌టయల్‌ స్నిప్‌ (సూది తోక పుర్రెది) పక్షి ఒకటి, సిట్రిన్‌ వాగ్‌టయల్‌ (పసుపు త­ల జిట్టంగి) పక్షులు నాలుగు, మరికొన్ని జా­తుల పక్షులు చాలా తక్కువగా కనిపించాయి.   పక్షుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం కొల్లేరులోని సహజసిద్ధ వాతావరణం పక్షులను ఆకర్షిస్తోంది.

దేశ విదేశాల నుంచి ఏటా విడిది కోసం కొల్లేరుకు వేలాదిగా పక్షులు వస్తుంటాయి. వీటి సంరక్షణ కోసం అటవీశాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. కొల్లేరు అభయారణ్యంలో పక్షుల గణన వల్ల రానున్న రోజుల్లో పక్షుల సంరక్షణకు విధివిధానాలు రూపొందించే అవకాశం ఉంటుంది.  – ఎస్‌వీకే కుమార్, వైల్ట్‌లైఫ్‌ ఫారెస్ట్‌ రేంజర్, ఏలూరు 

మరిన్ని వార్తలు