వన్య ప్రాణులకు జీవధార

11 May, 2023 04:39 IST|Sakshi

ఇప్పటికే చలమలు, చెక్‌డ్యామ్‌లు 

అవి కాకుండా 60 నీటి తొట్టెల ఏర్పాటు

వడదెబ్బ కొట్టకుండా ఉప్పు ముద్దల ఏర్పాటు

పాపికొండల అభయారణ్యంలో అధికారుల చర్యలు 

బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా): వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రెండేళ్లుగా వన్యప్రాణి సంరక్షణ కోసం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో వేసవిలో నీటి కోసం వన్యప్రాణులు అటవీ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వచ్చేవి. ఆ సమయంలో కుక్కల బారిన లేదా వాహనాల కింద పడి మృతి చెందేవి.

ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు జిల్లా పరిధిలోని పాపికొండల అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో సుమారు 60 నీటి తొట్టెలను ఏర్పాటు చేసినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. వీటితో పాటు అటవీ ప్రాంతంలోని కాలువల్లో 20 చలమలను తీసి, వన్యప్రాణులకు నీటి సౌకర్యం లభించేలా చర్యలు తీసుకున్నారు. అవి కాకుండా 25 చెక్‌ డ్యామ్‌ల ద్వారా నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా నీటి తొట్టెల్లో వేసవిలో నాలుగు రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా బేస్‌క్యాంప్‌ సిబ్బంది, బీట్‌ అధికారులు నీటిని తెచ్చి నింపుతున్నారు.

ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.1.50 లక్షలు మంజూరు చేస్తోంది. నీటి తొట్టెల పక్కన ఉప్పు ముద్దలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నీటి కోసం వచ్చిన వన్యప్రాణులు ఆ నీరు తాగి.. ఉప్పు ముద్దను నాకుతాయని.. దీనివల్ల వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశాలుంటాయని అటవీశాఖ అధికారులంటున్నారు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పాపికొండల అభయారణ్యం పరిధిలో ఉన్న బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి.

పాపికొండల అభయారణ్యంలో ఎలుగు బంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, చిరుతలు, ముళ్ల పందులు, జాకర్స్, దున్నలు వంటి అనేక జంతువులున్నట్లు అధికారులు గుర్తించారు. వాటికి వేసవిలో దాహార్తి తీర్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

నీటి సమస్య తలెత్తకుండా చర్యలు 
పాపికొండల అభయా­ర­ణ్యం­లోని వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. సుమారు 60 నీటి తొట్టెలు వన్య­ప్రా­ణులు సంచరించే ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. వేసవిలో నాలుగు రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా నీరు పోసి నింపుతున్నాం. జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. 
 – దావీదు రాజునాయుడు,  ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి, పోలవరం 

మరిన్ని వార్తలు