బుడిబుడి అడుగులు బాపట్లలో..

2 May, 2021 04:45 IST|Sakshi
గుడ్డు నుంచి బయటకు వస్తున్న తాబేలు పిల్ల

అంతరిస్తున్న ‘ఆలివ్‌ రిడ్లే’ తాబేళ్ల సంరక్షణకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు

సూర్యలంక, నిజాంపట్నం తీరంలో ప్రత్యేక హేచరీలు

గుడ్లను పొదిగించి పిల్ల తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెడుతున్న అధికారులు

సాక్షి, అమరావతి బ్యూరో/బాపట్ల టౌన్‌ : సముద్ర తాబేళ్లుగా పిలిచే ‘ఆలీవ్‌ రిడ్లే’ జాతిని సంరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బాపట్ల తీరంలోని సూర్యలంక బీచ్‌లో ఇప్పటికే 8 వేలకు పైగా ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల గుడ్లను సేకరించారు. వాటిని పొదిగించి 6 వేల పిల్లలను సముద్రంలోకి వదిలిపెట్టారు. మరో 2 వేల గుడ్లను పొదిగించే పనిలో ఉన్నారు. ఈ తాబేళ్లు సముద్ర గర్భంలోని పాచి, పిచ్చి మొక్కలు, జెల్లీ ఫిష్, ఇతర వ్యర్థాలను తింటూ జలాలు కలుషితం కాకుండా చూస్తాయి. మత్స్య సంపదను పెంపొందించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తూ మత్స్యకారులకు జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన, పర్యావరణ నేస్తాలైన ఈ జాతి తాబేళ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సముద్రంలో భారీగా కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు, పెద్దబోట్ల రాకపోకల వల్ల నలిగిపోవడం, వాటి గుడ్లను నక్కలు, కుక్కలు వంటివి తినేయడం వంటి కారణాల వల్ల వాటి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. దీంతో ఈ జాతిని సంరక్షించేందుకు ఆటవీ శాఖ అధికారులు బాపట్ల డివిజన్‌ పరిధిలోని సూర్యలంక, నిజాం పట్నం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

సంరక్షణ కేంద్రాల ఏర్పాటుతో..
అనువైన పరిస్థితులు ఉండటంతో ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు రేపల్లె రేంజ్‌ పరిధిలోని బాపట్ల, నిజాంపట్నం తీరాలకు ఏటా వలస వచ్చి గుడ్లు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ఆటవీ శాఖ 2020 డిసెంబర్‌లో సూర్యలంక, నిజాంపట్నం తీరాల్లో తాబేళ్ల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ రెండుచోట్లా హేచరీలను నెలకొల్పి మత్స్యకారులను కూలీలుగా నియమించింది. ఈ తాబేళ్లు అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 5.30 గంటల మధ్య ఒడ్డుకు చేరతాయి. తీరంలోని ఇసుక తిన్నెల్లో గుంతలు తీసి గుడ్లు పెట్టి.. వాటిని ఇసుక మూసివేసి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఇసుక తిన్నెల్లో తాబేళ్ల అడుగు జాడలను మత్స్యకారులు ఎప్పటికప్పుడు గుర్తిస్తూ.. వాటి గుడ్లను సేకరించి హేచరీలకు తరలిస్తుంటారు. గతంలో సముద్ర తాబేళ్ల గుడ్లను నక్కలు, కుందేళ్లు, కుక్కలు వంటివి తింటూ ఉండేవి. దీనివల్ల ఆ జాతి తాబేళ్ల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. వీటి బారినుంచి సంరక్షించేందుకు అటవీ శాఖ నడుం కట్టడంతో ఆ జాతి మనుగడకు అవకాశం ఏర్పడింది.
తీరం నుంచి సముద్రంలోకి వెళ్తున్న తాబేళ్ల పిల్లలు 

మత్స్యకారులకు వరం
ఈ తాబేళ్ళు సముద్రంలోని చేపలకు హాని కలిగించే జెల్లీ ఫిష్‌ను తిని మత్స్య సంపద పెరుగుదలకు సహకరిస్తుంది. చేపల వేట సమయంలో జెల్లీ ఫిష్‌ మత్స్యకారుల వలలకు తగిలితే వాటి పోగులు దెబ్బతింటాయి. ఆ పోగులు తగిలితే మత్స్యకారులకు జ్వరం, శరీరమంతా నొప్పులతో అనారోగ్యం పాలవుతుంటారు. ఇంతటి ప్రమాదకరమైన జెల్లీ ఫిష్‌ను తినే శక్తి ఒక్క ఆలివ్‌ రిడ్లే తాబేళ్లకు మాత్రమే ఉంది. సముద్రంలో అలజడి నెలకొన్నప్పుడు ఈ తాబేళ్లు వాతావరణ పరిస్థితులను ముందుగానే పసిగట్టి తీరానికి చేరుకుంటాయి. వీటి రాకను గమనించిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లడం మానుకుంటారు. చేపలు గుడ్లు పెట్టే సమయంలో సముద్రంలో పేరుకుపోయిన వ్యర్థాలు వాటికి అడ్డుపడుతుంటాయి. అలాంటి వ్యర్థాలను తాబేళ్లు భుజించి చేపల పునరుత్పత్తికి దోహదం చేస్తాయి. సముద్రంలో ఆక్సిజన్‌ శాతాన్ని పెంచేందుకు కూడా ఈ తాబేళ్లు ఎంతగానో దోహదపడతాయి. 

సంరక్షించేందుకే హేచరీలు
ఆలివ్‌ రిడ్లే జాతి తాబేళ్ల సంతతిని అభివృద్ధి చేసేందుకు డీఎఫ్‌వో రామచంద్రరావు ఆధ్వర్యంలో ప్రత్యేక హేచరీలు ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు 8 వేలకు పైగా గుడ్లను సేకరించాం. వాటిల్లో 6 వేల పిల్లలను సముద్రంలో ఇప్పటికే వదిలిపెట్టాం. మిగిలిన రెండు వేల గుడ్లు పొదిగే దశలో ఉన్నాయి.
– జఫ్రుల్లా, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్, బాపట్ల

వీటి జీవనం మత్స్యకారులకు వరం
సముద్రంలో ఉండే జెల్లీ ఫిష్‌ వల్ల మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ జాతి తాబేళ్లు సూర్యలంక తీరంలో సంచరిస్తున్నప్పటి నుంచి జెల్లీ ఫిష్‌ సమస్యల నుంచి మత్స్యకారులకు ఊరట లభిస్తోంది. ఈ తాబేళ్లు జీవనం మత్స్యకారులకు వరం.
– కన్నా మామిడయ్య, డైరెక్టర్, రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సంఘం, బాపట్ల 

మరిన్ని వార్తలు