శ్రీశైలం దేవస్థానానికి 4,500 ఎకరాలు ఇచ్చేందుకు రెడీ

22 Feb, 2023 04:25 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న శ్రీశైలం దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న, అటవీశాఖ డిప్యుటీ డైరెక్టర్‌ అలెన్‌చాంగ్‌టెరాన్‌

అటవీ శాఖ అంగీకారం.. కేంద్రానికి లేఖ

శ్రీశైలం ప్రాజెక్ట్‌: శ్రీశైలం దేవస్థానానికి చెందిన 4,500 ఎకరాల భూమిని అప్పగించేందుకు అటవీశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. గత 50 ఏళ్లుగా ఈ భూమికి సంబంధించిన సమస్య అటవీశాఖకు, దేవస్థానానికి మధ్య పెండింగ్‌లో ఉంది. ఇటీవల శ్రీశైల దేవస్థానానికి చెందిన భూముల వివరాలు పురాతన శాసనం ద్వారా వెలుగులోకి వచ్చాయి.

దాని ఆధారంగా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి అటవీశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ వెంటనే అటవీ, దేవదాయ, రెవెన్యూ శాఖల అధికారులు ఉమ్మడిగా అత్యంత ఆ«ధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సర్వే చేయించారు.

వారు ఆ 4,500 ఎకరాల భూమి శ్రీశైలం దేవస్థానానికి చెందినదేనని ధ్రువీకరించారు. దీంతో రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆ భూమిని దేవస్థానానికి అప్పగించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

ఈ మేరకు మంగళవారం నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ప్రాజెక్ట్‌ కేంద్ర కార్యాలయంలో శ్రీశైలం దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న, అటవీశాఖ డిప్యుటీ డైరెక్టర్‌ అలెన్‌చాంగ్‌టెరాన్‌ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఆ కాపీని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ వై.మధుసూదన్‌రెడ్డి, కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ వై.శ్రీనివాసరెడ్డిలకు పంపారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖకు భూమిని అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. త్వరలోనే కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని, ఆ వెంటనే దేవదాయ శాఖకు భూమిని అప్పగిస్తామని అలెన్‌చాంగ్‌టెరాన్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు