పులిని చంపి వండుకుని తిన్నారు? 

20 Feb, 2023 11:04 IST|Sakshi

వదంతులు అంటున్న ఫారెస్ట్‌ అధికారులు

యర్రగొండపాలెం:(ప్రకాశం జిల్లా): పులిని చంపి వండుకుని తిన్నారని అటవీ శాఖాధికారులకు సమాచారం అందింది. దీనిపై వెంటనే స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. పుల్లలచెరువు మండలంలోని అక్కచెరువు చెంచుగూడెంకు సమీపంలోని ఈతల కొండ, ఎర్రదరి ప్రాంతాల్లో దుప్పులు, మనపోతులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఆ ప్రాంతానికి చెందిన గిరిజనులు కొంతమంది విద్యుత్‌ తీగలుపెట్టి జంతువులను వేటాడుతుంటారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ నెల 10వ తేదీన ఆ ప్రాంతంలో పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారులకు తెలిసింది. ఈ మేరకు ఆ ప్రాంతంలో పులి పాదముద్రలు కూడా ఫారెస్ట్‌ అధికారులు సేకరించారు. ఈ పులిని కరెంటు తీగలు పెట్టి చంపారని, తోలును అడవిలో ఉన్న బావిలో వేసి, మాంసాన్ని వండుకుని తిన్నారని యర్రగొండపాలెంలోని అటవీశాఖ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందించారు. ఈ విషయాన్ని ఆ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది ధ్రువీకరించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

మూడు పులులు సంచరిస్తున్నాయి  
పులిని చంపి దాని మాంసం వడుకుని తిన్నారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ఎ.నీలకంఠేశ్వరరెడ్డి వివరణ ఇచ్చారు. తమకు అందిన సమాచారం మేరకు అక్కపాలెం ప్రాంతంలో విచారణ చేపట్టామని ఆయన తెలిపారు. పులి సంచరిస్తోందని తెలిసిన వెంటనే పాదముద్రలు సేకరించామని, తద్వారా అక్కడ రెండు ఆడ పులులు, ఒక మగపులి సంచరిస్తోందని తేలిందని ఆయన వివరించారు.

అటవీ జంతువులు ఎక్కువగా సంచరిస్తున్న ఆ ప్రాంతంలో సహజంగానే పులులు తిరుగుతుంటాయన్నారు. అడవి జంతువులను వేటాడేందుకు విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేస్తున్నట్లు తమకు కూడా తెలిసిందని, దీనివల్ల పులులకు ప్రాణహాని ఉంటుందన్నారు. విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడి అటవీ ప్రాంతంలో విద్యుత్‌ సౌకర్యం లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. పులిని చంపినట్లు వస్తున్న వదంతులపై తమ దర్యాప్తు ఇంకా ముగియలేదని ఎఫ్‌ఆర్‌ఓ చెప్పారు.
చదవండి: బీజేపీకి ‘కన్నం’ అందుకేనా?.. నెక్ట్స్ ఏంటి?.. జరిగేది అదేనా?

మరిన్ని వార్తలు