నల్లమల అటవీ ప్రాంతం.. కార్చిచ్చుకు కళ్లెం

25 Apr, 2022 08:47 IST|Sakshi
నల్లమలలో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

నల్లమల అటవీ ప్రాంతం.. నాలుగు జిల్లాల పరిధిలో పది లక్షల ఎకరాల్లో  విస్తరించి ఉన్న ఈ సువిశాల అరణ్యంలో ఒక్క చోట అగ్గిరాజుకుంటే చాలు వందల ఎకరాల్లో బుగ్గి మిగులుతుంది. మండు వేసవిలో ఈ అగ్నిప్రమాదాల బెడద ఇంకా ఎక్కువ. మానవ తప్పిదాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. పచ్చని అడవుల్లో కార్చిచ్చుకు కళ్లెం వేసేలా అటవీ శాఖ ఫైర్‌వాచర్స్‌ను నియమించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి అగ్నినిరోధక పరికరాలను అందజేసింది. అటవీ ప్రాంతంలో నీటి కుంటలు ఏర్పాటు చేసి అప్పటికప్పుడు నీటిని తీసుకెళ్లేందుకు వాహనాలు సమకూర్చింది. 

మార్కాపురం: వేసవి వచ్చిందంటే అగ్ని ప్రమాదాల భయం వెంటాడుతోంది. తెలిసో తెలియకో చేస్తున్న మానవ తప్పిదాలు అడవులను కాల్చివేస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అడవుల్లో ప్రమాదాలు జరిగి ఆందోళన కలిగిస్తున్నాయి. దీని వలన పర్యావరణం దెబ్బతింటోంది. నల్లమల అటవీ ప్రాంతం ప్రకాశం, గుంటూరు, కర్నూలు, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌ నగర్‌ జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉంది. మార్కాపురం డీఎఫ్‌వో పరిధిలో 900 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. మార్కాపురం డీఎఫ్‌ఓ పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం, గంజివారిపల్లె, గుంటూరు జిల్లాలోని విజయపురిసౌత్‌ రేంజ్‌లు ఉండగా, గిద్దలూరు పరిధిలో గిద్దలూరు, గుండ్లకమ్మ, తురిమెళ్ల, కనిగిరి, ఒంగోలు ఉన్నాయి.

దోర్నాల నుంచి శ్రీశైలం, దోర్నాల–ఆత్మకూరు, గిద్దలూరు– నంద్యాల మధ్య ఘాట్‌ రోడ్డులో ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణికులు వాహనాల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. కొంత మంది బీడీ, సిగరెట్‌ తాగి ఆర్పకుండా రోడ్డుపై వేస్తున్నారు. వేసవి తీవ్రత వలన అలా కిందపడిన నిప్పు గడ్డికి అంటుకుని వేగంగా వ్యాపించి అడవులను దహిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది. అటవీశాఖ అధికారులు ప్రయాణికులకు, ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నా కొంత మందిలో చైతన్యం లేకపోవటం, మరికొందరు ఏమరుపాటుగా సిగరెట్‌ తాగి రోడ్డు పక్కన వేయటం వలన తరచుగా అడవిలో మంటలు రేగుతున్నాయి. వీటిని చల్లార్చేందుకు అటవీశాఖ సిబ్బంది తీవ్రంగా కష్టపడుతుంటారు. 

110 మంది వాచర్ల నియామకం: 
ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ ముందుగానే మేల్కొని అగ్నిప్రమాదాల నివారణకు శిక్షణ ఇచ్చిన ప్రత్యేక సిబ్బందిని నియమించాయి. మార్కాపురం డీఎఫ్‌ఓ పరిధిలో ఉన్న మార్కాపురం, గంజివారిపల్లె, యర్రగొండపాలెం, పెద్దదోర్నాల, గుంటూరు విజయపురిసౌత్‌ వరకు విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరిగితే తక్షణం అక్కడికి వెళ్లి మంటలను ఆర్పేందుకు 110 మంది ఫైర్‌వాచర్స్‌ను ప్రభుత్వం నియమించింది. వీరికి ఫైర్‌ ఫైటింగ్‌ ఎక్విప్‌మెంట్లను అందజేశారు. దీనితో పాటు అటవీ ప్రాంతంలో నీటి కుంటలు ఏర్పాటు చేసి అప్పటికప్పుడు నీటిని తీసుకెళ్లేందుకు వాహనాలు సమకూర్చారు.

ఈ సిబ్బంది దోర్నాల నుంచి శ్రీశైలం వరకు, యర్రగొండపాలెం నుంచి మాచర్ల వరకు, దోర్నాల నుంచి ఆత్మకూరు వరకు తమకు కేటాయించిన ప్రాంతాల్లో నిరంతరం తిరుగుతూ ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ అగ్నిప్రమాదాలు జరగకుండా చూస్తున్నారు. దీంతో పాటు శ్రీశైలం వెళ్లే ప్రయాణికుల వాహనాలను గణపతి చెక్‌పోస్టు వద్ద ఆపి బీడీ, సిగరెట్లు తీసివేస్తూ, అగ్నిని మండించే పదార్థాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. 2020 ఏప్రిల్‌లో అర్ధవీడు మండలం బొమ్మిలింగం అటవీ ప్రాంతంలో భారీ స్థాయిలో అగ్నిప్రమాదం జరిగి చాలా వరకు అటవీ ప్రాంతం కాలిపోయింది.  

ప్రత్యేక శిక్షణ ఇచ్చాం:  
ఈ ఏడాది అటవీ ప్రాంతంలో 950 అగ్ని ప్రమాద సంఘటనలు జరిగాయి. మా సిబ్బంది వెంటనే స్పందించి మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే చెంచులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. ప్రమాదం జరిగిన వెంటనే మాకు సమాచారం అందిస్తారు. దీని ద్వారా మేము సిబ్బందిని అప్రమత్తం చేసి సంఘటన స్థలానికి పంపి మంటలను ఆర్పివేస్తాం. ప్రయాణికులు కూడా అటవీ ప్రాంతంలో ప్రయాణించేటప్పుడు బీడీలు, సిగరెట్లు తాగవద్దని మా విజ్ఞప్తి. చిన్న ప్రమాదం జరిగినా ఆ నష్టాన్ని పూడ్చటం సాధ్యం కాదు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.  
– అప్పావు విఘ్నేష్, డీఎఫ్‌ఓ, మార్కాపురం  

వందల సంఖ్యలో ప్రమాదాలు
నల్లమల అటవీ ప్రాంతంలో ప్రతి ఏడాది వేసవిలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. గడిచిన 3 నెలల్లో నల్లమలలో 950 అగ్ని ప్రమాదాలు జరగగా సిబ్బంది సకాలంలో స్పందించి ఆర్పివేశారు. గత ఏడాది ఏప్రిల్‌ నాటికి 1500 అగ్ని ప్రమాదాలు జరిగినట్లు అటవీశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిన్న చెట్టుకు నిప్పు అంటుకున్నా అటవీ అధికారులు ప్రమాదాన్ని గుర్తించి కౌంట్‌ చేస్తారు. అగ్ని ప్రమాదాల వలన పర్యావరణ కాలుష్యంతో పాటు విలువైన వృక్షసంపద, రకరకాల పక్షులు, జంతువులు మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి అడవిలో కార్చిచ్చు వ్యాపించిందంటే ఆర్పి వేయటం అటవీ, అగ్నిమాపక సిబ్బందికి తలకు మించిన భారమవుతోంది.

మరిన్ని వార్తలు