మాజీ సీఎం ‘కాసు’ సతీమణి కన్నుమూత

7 Jun, 2021 07:54 IST|Sakshi

నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు

హైదరాబాద్‌/సాక్షి, అమరావతి/నాదెండ్ల (చిలకలూరిపేట): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి రాఘవమ్మ (97) వృద్ధాప్య సమస్యలతో ఆదివారం ఉదయం సోమాజిగూడలోని ఆమె స్వగృహంలో కన్నుమూశారు. ఆమె మృతితో స్వగ్రామమైన ఏపీలోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఆమె అంత్యక్రియలు సోమవారం ఉదయం  11 గంటలకు హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో జరుగుతాయని మనవడు శివానందరెడ్డి వెల్లడించారు. 1964 నుంచి 1971 వరకు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి.. 1994 మే 20న దివంగతులయ్యారు. వీరికి సంతానం లేకపోవడంతో బ్రహ్మానందరెడ్డి చెల్లెలి కుమారుడిని దత్తత తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. రెండు నెలల క్రితం రాఘవమ్మ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అదే రోజు ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో ఇంటికి తీసుకొచ్చారు. 

ప్రజాసేవలోనూ మేటి..
చిరుమామిళ్ళలో రాఘవమ్మ, బ్రహ్మానందరెడ్డి ప్రాథమిక పాఠశాల, మాచర్ల, నరసరావుపేటల్లో కాసు రాఘవమ్మ, బ్రహ్మానందరెడ్డి కళాశాలలు నెలకొల్పి ప్రజలకు విద్యాసేవలందించారు. రా«ఘవమ్మ ప్రోద్బలంతో రాష్ట్రచరిత్రలో తొలిసారి నాటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి తూబాడులో పేదలకు ఐదు సెంట్లు చొప్పున నివేశన స్థలాలను అందించారు. దివంగత మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి రాఘవమ్మ మృతిపట్ల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. 

కాసు బ్రహ్మానందరెడ్డితో రాఘవమ్మ (ఫైల్‌) 

చదవండి: ఆరోగ్య సిబ్బంది వైద్య ఖర్చుల బాధ్యత ప్రభుత్వానిదే..  
ఫ్రంట్‌లైన్‌ సిబ్బందికి సీఎం అండ

మరిన్ని వార్తలు