మాజీ డీజీపీ ప్రసాద్‌రావు కన్నుమూత

10 May, 2021 09:01 IST|Sakshi

అమెరికాలో ఛాతీనొప్పితో మరణించిన మాజీ పోలీస్‌ బాస్‌

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి ఏపీలో డీజీపీగా సేవలందించిన మాజీ ఐపీఎస్‌ అధికారి బయ్యారపు ప్రసాదరావు కన్నుమూశారు. ఇటీవల అమెరికా వెళ్లిన ఆయన ఆదివారం రాత్రి ఛాతీనొప్పితో ఆసుపత్రిలో చేరారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో మృతిచెందారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జన్మించిన ప్రసాదరావు మద్రాస్‌ ఐఐటీలో ఎమ్మెస్సీ (ఫిజిక్స్‌) చేశారు. 1979లో ఐపీఎస్‌ సర్వీసులో చేరారు. ఉమ్మడి ఏపీకి ఆఖరి డీజీపీ ఆయనే కావడం గమనార్హం. నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాలకు ఎస్పీగా, విశాఖపట్నం, హైదరాబాద్‌లకు కమిషనర్‌గా పనిచేశారు. ఇంగ్లిష్‌ భాషపై, సైన్స్‌పై ఆయనకు మంచి పట్టు ఉండేది. ఏపీఎస్‌ ఆర్టీసీకి ఎండీగా కూడా ఆయన సేవలందించారు. ప్రసాదరావు సమర్థుడైన అధికారి అని, తన తరువాత తరాలకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని పలువురు ఐపీఎస్‌ అధికారులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. 

పోలీసు విభాగంలో విద్యావేత్త..! 
సాధారణంగా ఎవరైనా ఫోన్‌ ఎత్తగానే హలో అంటుంటారు. అయితే ‘నమస్తే ప్రసాదరావు’అనడం ఆయనకే సొంతం. 1955 సెప్టెంబర్‌ 11న పుట్టిన ప్రసాదరావు ఇంటర్‌ వరకు గుంటూరు జిల్లాలో తెలుగు మీడియంలో చదువుకున్నారు. ఆంధ్రా లయోలా కాలేజ్‌లో డిగ్రీలో చేరాక ఆంగ్లంలో మాట్లాడటానికి ఇబ్బందులు ఎదురుకావడంతో ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలని నిర్ణయించుకున్నారు. అలా ప్రారంభమైన తపన దాదాపు 11 వేల పదాలు ఆయన మేధస్సు అనే నిఘంటువులో నిక్షిప్తం అయ్యే వరకు వెళ్లింది. అయినప్పటికీ ప్రసాదరావు చేపట్టిన ‘ఆపరేషన్‌’కు పుల్‌స్టాప్‌ పడలేదు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ ఆయన పత్రికలు, పుస్తకాలు, నవలల నుంచి 20కి తక్కువ కాకుండా సాధ్యమైనన్ని కొత్త పదాలను ఎంపిక చేసుకుని, నిఘంటువు ద్వారా అర్థాలు తెలుసుకుంటూ జాబితా తయారు చేసేవారు.

ఇలా ‘ఎ’టు ‘జెడ్‌’వరకు అన్ని అక్షరాలకు సంబంధించిన పదాలతో దాదాపు 500 కథనాలు రాసిన ఆయన 11 వేల ఆంగ్ల పదాలను ఔపోశన పట్టారు. వీటిలో ‘సి’అక్షరానికి సంబంధించిన 640 పదాలతో రూపొందించిన కథనాల సమాహారాన్ని ‘వర్డ్‌ పవర్‌ టు మైండ్‌ పవర్‌’పేరుతో పుస్తకంగా మలిచారు. దీన్ని 2012లో ఆవిష్కరించారు. ఇక సైన్స్‌ పట్ల కూడా ప్రసాదరావు ఎంతో ఆసక్తి చూపేవారు. ఈ నేపథ్యంలోనే ఇంట్లోనే పెద్ద ఫిజిక్స్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఈ శాస్త్రంపై మంచి పట్టు సాధించిన ఆయన, సుదీర్ఘ పరిశోధన చేసి ‘థియరీ ఆఫ్‌ లైట్‌’లోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ ‘న్యూ లైట్‌ ఆన్‌ లైట్‌’సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేయగలిగారు. దీంతో ప్రసాదరావును డాక్టరేట్‌ వరించింది.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం
మాజీ డీజీపీ ప్రసాద్‌రావు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రసాద్‌రావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ  సానుభూతిని తెలిపారు.

ఏపీ గవర్నర్‌ సంతాపం..
మాజీ డీజీపీ ప్రసాదరావు మృతి పట్ల ఏపీ గవర్నర్‌ హరిచందన్‌ సంతాపం తెలిపారు. ప్రసాద్‌రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

గవర్నర్, సీఎం సంతాపం 
ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా సేవలందించిన ప్రసాదరావు మరణం పట్ల గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  

డీజీపీ, కొత్వాల్‌ దిగ్భ్రాంతి 
ప్రసాదరావు మృతిపై డీజీపీ మహేందర్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ సానుభూతి తెలిపారు. ప్రసాదరావు మరణించారనే వార్త షాక్‌కు గురి చేసిందని, ఆ విద్యావేత్తకు ఆంగ్లంలో కష్టమైన పదాలు నేర్చుకునే ఆసక్తి ఉండేదని నగర కొత్వాల్‌ అంజనీకుమార్‌ అన్నారు. ప్రసాదరావు లేరనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపీరెడ్డి అన్నారు.   

చదవండి: కాంట్రాక్టరు పాపం, అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
ఏం జరిగిందో ఏమో.. యువతి అనుమానాస్పద మృతి

మరిన్ని వార్తలు