వైరల్‌గా మారిన మాజీ మంత్రి ఫోటో

22 Feb, 2021 19:59 IST|Sakshi

సాక్షి, అనంతపురం : ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు మూడు తరాలు బతికేలా వెనకేసుకునే ఘనాపాటీలు ఉన్న దేశం మనది. సర్పంచ్‌ నుంచి ఎంపీ వరకు ప్రజాపతినిధులంతా కోట్లపై కన్నేసే వారే. ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిస్తే చాలు జీవితాంతం ప్రభుత్వ పింఛన్‌తో బతికొచ్చని ఆరాపడేవారే. ప్రస్తుత రాజకీయాల్లో ఎంతోమంది ఇదే కోవకు చెందినవారు ఉన్నారు. ఎక్కడో ఒకరు రాజకీయాల నుంచి రిటైరైన తరువాత సాధారణ జీవితం గడిపేందుకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుత కమర్శియల్‌ పాలిటిక్స్‌లో ఓ మాజీమంత్రి అందరికీ  ఆదర్శంగా నిలిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మంత్రిగా సేవలు  అందించి, విభజన అనంతపురం పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన రఘువీరారెడ్డి ప్రస్తుతం సాధారణ రైతుగా జీవితాన్ని గడిపేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడూ చుట్టూ పదిమంది గన్‌మెన్స్‌, పదికార్ల కాన్వాయ్‌తో ఎప్పూడూ హడావిడిగా ఉండే ఆయన.. ప్రస్తుతం అవేవీ లేకుండా సామాన్యుడిలా ఉంటున్నారు. పూర్తిగా నెరిసిన గెడ్డంతో.. పక్కా రాయలసీమ స్టైల్‌లో ఎవరూ గుర్తుపట్టలేని విధంగా రఘవీరా మారిపోయారు. తెల్లటి పంచ కట్టుకుని చిన్న టూవీలర్‌ను నడుపుతూ ఆయన వెళ్తున్న ఫోటో సోషల్ ‌మీడియాలో వైరల్‌గా మారింది. 

ఆదివారం ఏపీలో జరిగిన పంచాయితీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌లో ఓటు వేసేందుకు ఒక పాత మోపెడ్ మీద వెళ్తున్న ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నాలుగో విడత పంచాయితీ ఎన్నికల్లో భాగంగా అనంతపురం జిల్లా గంగులవానిపాలెంలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి ఓ పాత మోపెడ్ వాహనంపై తన సతీమణి సునీతతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. దీనికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్‌ వస్తున్నాయి. ఏపీ రాజకీయాలలో ఒక్కప్పుడు చక్రం తిప్పిన నాయకుడు ఇప్పుడు సాధారణ వ్యక్తిలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయనే స్వయంగా ట్విటర్‌లో షేర్‌ చేశారు.

రఘువీరరెడ్డి రాజకీయ జీవితం..
1985లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 1989లో మడకశిర నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున శాననసభ్యుడిగా ఎన్నికయ్యారు. కోట్ల విజయభాస్కర రెడ్డి మంత్రివర్గంలో తొలిసారి పశు సంవర్థక శాఖా మంత్రిగా పనిచేశారు. 1994 శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 లో మరోసారి గెలుపొంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్సార్‌ మంత్రివర్గంలో మళ్లీ వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశారు. రాజశేఖరరెడ్డి మృతి తర్వాత కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో రెవిన్యూ శాఖా మంత్రిగా పనిచేశారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో కూడా రెవిన్యూ శాఖా మంత్రిగా కొనసాగారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన నేపథ్యంలో అవశేష ఆంధ్ర ప్రదేశ్‌కు పీసీసీ చీఫ్‌ అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. ఆయన స్థానంలో మరోనేతను ఎన్నుకున్న అనంతరం పూర్తిగా రాజకీయాలకు దూరమైయ్యారు. 


 

మరిన్ని వార్తలు