మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత

1 Mar, 2022 05:33 IST|Sakshi

హైదరాబాద్‌లో తుదిశ్వాస 

తెనాలిలోని స్వగృహానికి భౌతికకాయం..

తెనాలి/సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరు జిల్లా తెనాలి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తొలితరం నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు (102) సోమవారం హైదరాబాద్‌లోని కుమార్తె జితా రవిశ్రీ నివాసంలో కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని స్వగృహానికి తీసుకొచ్చారు. వెంకట్రావు భార్య అలిమేలుమంగమ్మ గతేడాది మృతిచెందారు. తనయుడు జయరామ్, కోడలు హిమకుమారి కూడా అంతకుముందే కాలం చేశారు. యడ్లపాటి వెంకట్రావు అంత్యక్రియల్ని బుధవారం తెనాలిలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

బుధవారం ఉదయం బుర్రిపాలెంరోడ్డులోని వెంకట్రావు స్వస్థలం నుంచి అంతిమయాత్ర బయలుదేరుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో వెంకట్రావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, రేపు తెనాలిలో జరిగే అంత్యక్రియల్లోనూ పాల్గొననున్నారు. యడ్లపాటి భౌతికకాయాన్ని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు దేసు శ్రీనివాసరావు, వివిధ పార్టీల నేతలు నన్నపనేని రాజకుమారి, డాక్టర్‌ గోగినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్, నక్కా ఆనందబాబు, పాటిబండ్ల రామకృష్ణ, దాసరి బాలవర్ధనరావు, చలసాని ఆంజనేయులు, పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం, రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు ఈదర వెంకటపూర్ణచంద్‌ తదితరులు సందర్శించి నివాళులర్పించారు.  

సుదీర్ఘ రాజకీయ జీవితం.. 
తెనాలికి సమీపంలోని అమృతలూరు మండలం బోడపాడులో మోతుబరి రైతు కుటుంబంలో 1919 డిసెంబర్‌ 16న వెంకట్రావు జన్మించారు. తురుమెళ్లలో హైస్కూలు విద్య తర్వాత గుంటూరులోని ఏసీ కాలేజిలో ఎఫ్‌ఏ, బీఏ చేశారు. 1941లో చెన్నైలోని లా కాలేజీలో చేరారు. 1945 నుంచి న్యాయవాదిగా తెనాలిలో స్థిరపడ్డారు. 1973 వరకు ప్రాక్టీసులో ఉంటూనే రాజకీయాల్లో కొనసాగారు. ఎన్జీరంగా అనుచరుడిగా ఆయన స్థాపించిన స్వతంత్ర పార్టీతో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ పార్టీ తరఫున వేమూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి 1962, 1965 ఎన్నికల్లో ఓడిపోగా, 1967 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

తరువాత వరుసగా రెండుసార్లు శాసనసభకు ఎన్నికైన యడ్లపాటి ఆ నియోజకవర్గంలో హ్యాట్రిక్‌ కొట్టిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. డాక్టర్‌ చెన్నారెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయం, న్యాయశాఖ మంత్రిగా, టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో వ్యవసాయశాఖ మంత్రిగా చేశారు. వడ్లమూడి వద్ద 1977లో ఏర్పాటైన సంగం డెయిరీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1989 నుంచి టీడీపీలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పదేళ్లపాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 1995లో గుంటూరు జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.    

ఉపరాష్ట్రపతి సంతాపం 
యడ్లపాటి వెంకట్రావు మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు కూడా సంతాపం తెలిపారు. 

మరిన్ని వార్తలు