కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

5 Aug, 2020 04:56 IST|Sakshi

విజయవాడలో చికిత్స పొందుతూ తుదిశ్వాస

వీఆర్‌పురం, (రంపచోడవరం)/సాక్షి అమరావతి:  సీపీఎం నేత, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (62) కరోనా బారినపడి కన్నుమూశారు. కోవిడ్‌ సోకిన ఆయనను మెరుగైన వైద్యం నిమిత్తం సోమవారం విజయవాడలోని కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందారు. గత కొద్దిరోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో సోమవారం భద్రాచలంలో కరోనా పరీక్ష చేయించగా ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, కోవిడ్‌–19 నిబంధనలకు అనుగుణంగా మంగళవారం రాజయ్య అంత్యక్రియలను తూర్పు గోదావరి జిల్లా వీఆర్‌పురం మండలంలోని ఆయన స్వగ్రామం సున్నంవారిగూడెంలో నిర్వహించినట్లు తహసీల్దార్‌ ఎన్‌. శ్రీధర్‌ తెలిపారు. రాజయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భద్రాచలం అసెంబ్లీ స్థానం నుంచి సీపీఎం తరఫున 1999, 2004, 2014లలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. రాజయ్యకు తల్లి కన్నమ్మ, భార్య చుక్కమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సున్నం రాజయ్య మృతికి సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలు మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తంచేశాయి. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని పేర్కొన్నాయి. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా సంతాపం తెలిపారు. 

సీఎం జగన్‌ సంతాపం 
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్‌ నాయకుడు సున్నం రాజయ్య మృతిపట్ల సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర విచారాన్ని వ్యక్తంచేశారు. రాజయ్య కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  

మరిన్ని వార్తలు