తీవ్రమైన ఆ ఆరోపణలపై విచారణ జరగాలి

15 Oct, 2020 02:38 IST|Sakshi

ప్రధాన న్యాయమూర్తి మౌనంగా ఉంటారనుకోను

ఆయన నిర్ణయానికి వదిలిపెట్టాలి

ఆరోపణల గురించి ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది

హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌ ఇచ్చి ఉండాల్సింది కాదు

‘సాక్షి’ ఇంటర్వ్యూలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గంగూలి

(ప్రవీణ్‌కుమార్‌ లెంకల) సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యాంగ బద్ధంగా విధులు నిర్వర్తించే ఒక ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలతో కూడిన లేఖ రాసినప్పుడు.. దానిపై విచారణ జరగాలని, ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గంగూలి పేర్కొన్నారు. ఆరోపణలపై తగిన విచారణ జరగాల్సి ఉందని, గౌరవ ప్రధాన న్యాయమూర్తి దీనిపై మౌనంగా ఉంటారని తాను భావించడం లేదన్నారు. ఆయన నిర్ణయానికి దీనిని వదిలిపెట్టాలని అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

ప్రశ్న: మీరు న్యాయ వ్యవస్థలో పారదర్శకత, జవాబు దారీతనం గురించి ఇటీవల మాట్లాడారు. అమరావతి భూ కుంభకోణంలో ఆరోపణలకు సంబంధించి తాజా పరిణామాలను మీరు ఎలా చూస్తారు?
జస్టిస్‌ ఏకే గంగూలి: న్యాయ వ్యవస్థలో పారదర్శకత చాలా ముఖ్యం. నేను ఈ వ్యవహారంపై నిన్న (మంగళవారం)నే ఒక టీవీ చానల్‌ చర్చలో మాట్లాడాను. నా అభిప్రాయం అదే. సుప్రీంకోర్టు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ముఖ్యమంత్రి స్వయంగా రాజ్యాంగ విధులు నిర్వర్తించే వ్యక్తి. రాష్ట్రంలో అత్యున్నత కార్యనిర్వాహక హోదా కలిగిన వ్యక్తి. అలాంటి ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి కాగలిగిన సీనియర్‌ న్యాయమూర్తిపై పలు ఆరోపణలతో కూడిన లేఖను చీఫ్‌ జస్టిస్‌కు రాశారు. రాష్ట్ర హైకోర్టు న్యాయ పాలనలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రికి గల రాజకీయ విరోధులకు ప్రయోజనం చేకూర్చేలా ఒక ప్రణాళికతో ఆ న్యాయమూర్తి వ్యవహరించారని, అపవిత్రమైన భూ వ్యవహారాల్లో కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేశారు. ఇది తీవ్రమైన ఆరోపణ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటారని నేను అనుకోను. ఆయన తప్పకుండా చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాను. ఎలాంటి విచారణ ఉంటుందో, ఏ చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు. ఈ మొత్తం వ్యవహారంపై ఆయన మౌనంగా ఉండలేరు. ఇది చాలా తీవ్రమైన వ్యవహారం. ఆరోపణలపై తగిన రీతిలో దర్యాప్తు జరపాలి. నాకు అర్థమైనంత వరకు.. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి కుమార్తెలు ఈ వ్యవహారంలో ఉన్నందున ఆరోపణలపై దర్యాప్తు జరగాలి. 

ప్రశ్న : ప్రభావవంతమైన వ్యక్తులపై ఆరోపణలు ఉన్నప్పుడు దర్యాప్తు ఆపాలా?
జస్టిస్‌ ఏకే గంగూలి : విచారణ ఎలా జరగాలి? ఎవరు జరపాలి? అన్న అంశాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించాల్సి ఉంటుంది. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విస్మరించరని నా అభిప్రాయం. 

ప్రశ్న : హైకోర్టు మీడియాపై గాగ్‌ ఆర్డర్‌ జారీ చేయడాన్ని ఎలా చూస్తారు?
జస్టిస్‌ ఏకే గంగూలి : గ్యాగ్‌ ఆర్డర్‌ జారీ చేయకూడదు. ఆరోపణలపై ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. న్యాయస్థానం పబ్లిక్‌ ఇన్‌స్టిట్యూషన్‌. సిట్టింగ్‌ న్యాయమూర్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు సాధారణ ప్రజలకు తెలుసుకునే అవసరం ఉంది. న్యాయమూర్తులు ప్రజాస్వామ్యంలో సభ్యులు.

ప్రశ్న : తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ముఖ్యమంత్రి భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడాన్ని, దానిని ప్రజల ముందు పెట్టడాన్ని ఎలా చూస్తారు?
జస్టిస్‌ ఏకే గంగూలి : ఇలా ఆరోపణలు చేసిన సంఘటన ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు. నేను ఎప్పుడూ చూడలేదు. అదే రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపణలు చేశారు. 

ప్రశ్న : భారత ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యవహారంలో ఎలాంటి చర్య తీసుకునే అవకాశం ఉంది?
జస్టిస్‌ ఏకే గంగూలి : నేను దానిని ఊహించలేను. ఈ దేశ పౌరుడిగా, మాజీ న్యాయమూర్తిగా నేను ఏం ఆశించగలనంటే.. చీఫ్‌ జస్టిస్‌ దీనిని పక్కన పెట్టేస్తారని అనుకోవడం లేదు. సాధారణ ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా న్యాయమూర్తులు పని చేయాల్సి ఉంటుంది. న్యాయ వ్యవస్థ సక్రమంగా నడిచేలా సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఆ మేరకు తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. 

ప్రశ్న : రాజ్యాంగాన్ని అనుసరించి ఎలాంటి విచారణ ఉండాలి? అది ఏ స్థాయిలో ఉండాలి?
జస్టిస్‌ ఏకే గంగూలి : నేను దానిని చెప్పలేను. రాజ్యాంగ బద్ధంగా వ్యవస్థ నడిచేందుకు ప్రధాన న్యాయమూర్తి తగిన చర్యలు తీసుకుంటారు. విచారణ ఎలా ఉండాలని గానీ, ఉంటుందని గానీ నేను ఇండికేట్‌ చేయదలుచుకోలేదు. గౌరవ ప్రధాన న్యాయమూర్తి విచక్షణ అది. ఆయన నిర్ణయానికి వదిలిపెట్టాలి. 

ప్రశ్న : గతంలో ఇలాంటి æఫిర్యాదులు వచ్చాయా? వస్తే ఎలాంటి విచారణ జరిగింది?
జస్టిస్‌ ఏకే గంగూలి : సిట్టింగ్‌ న్యాయమూర్తులపై ఇలాంటి ఫిర్యాదులు రావడం నా దృష్టిలో లేదు. అయితే ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు సిట్టింగ్‌ న్యాయమూర్తులతో కూడిన కమిటీ విచారణ జరిపింది. కానీ అది ఇలాంటి ఆరోపణ కాదు.

>
మరిన్ని వార్తలు