అపోహలు వద్దు.. ఆరోగ్యమే ముద్దు

17 Jun, 2022 18:17 IST|Sakshi

ఫోర్టిఫైడ్‌ బియ్యంపై అవగాహన సదస్సులో ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

టీడీపీ నాయకులు  అనవసర రాద్దాతం చేస్తున్నారంటూ ధ్వజం

కమలాపురం: ఫోర్టిఫైడ్‌ బియ్యం బలవర్ధకమైన ఆహారం అని, అవగాహన రాహిత్యంతోనే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. రెండు వారాలుగా ఫోర్టిఫైడ్‌ బియ్యంపై జరుగుతున్న సవాళ్లు, ప్రతి సవాళ్లకు తెరదించడం కోసం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో  స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం  పౌరసరఫరాలశాఖ జిల్లా అధికారి అర్జున్‌ రావ్‌ అధ్యక్షతన శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను పెండ్లిమర్రి మండలం, రేపల్లెలో గడపగడపకు వెళితే ఒకే ఓ మహిళ ప్లాస్టిక్‌ బియ్యం పంపిణీ చేస్తున్నారని తన దృష్టికి తీసుకొచ్చిందని, అవి ప్లాస్టిక్‌ కాదు ఫోర్టిఫైడ్‌ బియ్యం అని వివరంగా చెప్పగా ఆమె అర్థం చేసుకుందన్నారు. 

అయితే టీడీపీ నాయకులకు నిరక్షరాస్యులైన మహిళలకు ఉన్నంత అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు.  అవగాహన రాహిత్యంతోనే వారు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఫోర్టిఫైడ్‌ బియ్యం   బలవర్ధకమైన అని నిరూపించడం కోసమే ఇంత మంది అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించామన్నారు. తర్వాత కూడా ప్లాస్టిక్‌ బియ్యం అని ఎవరైనా చెబితే వారిపై సివిల్‌సప్లై అధికారులు కేసులు నమోదు చేస్తారన్నారు. ప్రజల్లో ఉన్న రక్తహీనతను నివారించడానికే ప్రధాన మంత్రి దేశమంతా ఈ బియ్యం పంపిణీ చేస్తున్నారని స్పష్టం చేశారు.  

ఈ బియ్యం తయారు చేయాలంటే టన్నుకు రూ.57వేలు ఖర్చు అవుతుందని, అయినా ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావించి అన్ని రాష్ట్రాల్లో ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ చేస్తున్నారన్నారు. అలాగే రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా ఉంటుందని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరో రెండేళ్లు గడువున్నా ఇప్పుడే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈ బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. 
 
ప్రజలకు క్షమాపణ చెప్పాలి:సీకేదిన్నె జెడ్పీటీసీ  
సీకే దిన్నె జెడ్పీటీసీ నరేన్‌ రామాంజుల రెడ్డి మాట్లాడుతూ ప్రజా చైతన్య యాత్రలు చేసే ప్రతి పక్ష నాయకులు ప్రజలను చైతన్య పరచాలే గాని తప్పుదోవ పట్టించరాదన్నారు.ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని ప్లాస్టిక్‌ బియ్యం అని ప్రజల్లో  అపోహలు సృష్టించిన టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి జిల్లాలోని 5.40లక్షల రేషన్‌ కార్డుదారులకు  బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి,అపోహలు తొలగించడానికి వచ్చిన శాస్త్రవేత్తలు,ప్రొఫెసర్లకు కృతజ్ఞతలైనా చెప్పాలన్నారు.  

వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్‌ సంబటూరు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ  రెండు వారాలుగా ఫోర్టిఫైడ్‌ బియ్యంపై నియోజకరవ్గంలో అధికార, ప్రతిపక్ష   పార్టీలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి. వాటిని తెరదించడానికి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ సునీత, జిల్లా ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ షమీమ్‌ బస్ట్, వర్థిరెడ్డి రోజా రాణి, సుబ్బారెడి  మాట్లాడారు. 

భోజనం చేసిన ఎమ్మెల్యే: సదస్సు ప్రాంగణంలోనే పోర్టిఫైడ్‌ బియ్యంతో చేసిన భోజనాన్ని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి తిన్నారు. ఇది బలవర్ధకమైన ఆహారం అని నిరూపించారు. 

జారుకున్న టీడీపీ నాయకులు
ఫోర్టిఫైడ్‌ బియ్యంపై కమలాపురం టీడీపీ ఇన్‌చార్జి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి తదితర నాయకులు రెండువారాలుగా రాద్ధాంతం చేశారు. ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇస్తున్న  బియ్యంలో ప్లాస్టిక్‌ బియ్యం ఉన్నాయని దుష్ప్రచారం చేశారు. అ యితే ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి మాత్రం అవి ప్లాస్టిక్‌ బియ్యం కాదని, బలవర్ధకమైన పోషకాహార విలువలు కలిగిన ఫోర్టిఫైడ్‌ బియ్యం అని వివరిస్తూ వచ్చారు. అయినప్పటికీ వినని ప్రతిపక్ష నాయకులు సవాళ్లకు దిగారు. వీరికి దీటుగా అధికారపక్షం నాయకులు ప్రతిసవాళ్లు విసిరా రు.ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలకు జ్ఞానోదయం కలిగే విధంగా ఎమ్మెల్యే గురువారం అన్ని పక్షాలను ఆహ్వానించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సు ప్రారంభమైన పది నిమిషాలకే తమ దుష్ప్రచారం ఎదురుతన్నిందని టీడీపీ నాయకులకు అర్థమైంది. అక్కడే చాలాసేపు ఉంటే ప్రజల్లో అపహాస్యం పాలవుతామని గ్రహించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి వారి సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తుండటంతో గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. దీంతో అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు.  

సూక్ష్మ పోషకాలు జోడించిన రైస్‌  
ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, బీ12 లాంటి సూక్ష్మ పోఠషకాలు త క్కువ పరిమాణంలో బి య్యంతో జోడించడాన్ని ఫోర్టిఫైడ్‌ రైస్‌ అంటారు. అనీమియా(రక్తహీనత) సైలెంట్‌ కిల్లర్‌. దీనిని అధిగమించాలంటే ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, బీ12 అవసరం.ప్రభుత్వాలు చాలా పరిశోధనలు చేసి ఫోర్టిఫైడ్‌ రైస్‌ తయారు చేసి  అందిస్తున్నారు. 
– ఎం. అరుణ, ప్రొఫెసర్, పద్మావతి మహిళా వర్సిటీ

అవగాహన సదస్సు హర్షణీయం  
ప్రజలకు ఫోర్టిఫైడ్‌ బియ్యంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం హర్షణీయం. విదేశాల్లో పాలు మొదలుకొని ప్రతి ఆహార పదార్థం పోర్టిఫైడే. చిన్నారులు, గర్భిణులు, బాలింతలే కాకుండా ప్రతి ఒక్కరూ పోర్టిఫైడ్‌ రైస్‌ను ఆహారంగా తీసుకోవాలి.  
–డా. ఎ. మంజుల, అసోసియేట్‌ ప్రొఫెసర్, ఎస్వీ యూనివర్శిటీ, తిరుపతి

ప్రతి ముగ్గురిలో ఒకరికి అనీమియా 
ప్రతి ముగ్గురిలో ఒకరికి అనీమీయా ఉంది. దీనిని నివారించడంలో  భాగంగా సూక్ష్మ పోషకాలను ప్రభుత్వం బియ్యంతో జోడించి  పంపిణీ చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి తెలియక వీటిని ప్లాస్టిక్‌ బియ్యం అంటున్నారు. అవగాహన కల్పించేందుకు  సదస్సు నిర్వహించడం శుభపరిణామం.    
–డా.జావలి  ప్రసూన, మెడికల్‌ ఆఫీసర్, పెద్దచెప్పలి పీహెచ్‌సీ

ఫోర్టిఫైడ్‌ ఆలోచన 1994లోనే ఉద్భవించింది  
ఫోర్టిఫైడ్‌ ఆలోచన 1994లోనే ఉద్భవించింది. ఆ సమయంలో చేసిన సర్వేల్లో అనీమియా, జింక్‌ లోపాలు లేకపోవడంతో అది మరుగున పడింది. పదేళ్ల తర్వాత  చేసిన సర్వేల్లో రోగాలన్నీ ఉన్నట్లు గుర్తించారు.  ఫోర్టిఫైడ్‌ బియ్యం  బలవర్ధకమైన ఆహారం.   
 –డా. శ్రీనివాసాచారి, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్, అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్,కడప 

భారత్‌ను డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది
ప్రతి నలుగురిలో ఒకరికి అనీమియా ఉందని భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. జిల్లాలో చిన్న పిల్లల్లో ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. దీనిని తరిమికొట్టాలి. లేకపోతే  ప్రాణ నష్టం జరగుతుందని గ్రహించిన భారత్‌ ప్రజలకు ఫోర్టిఫైడ్‌ బియ్యం అందించాలనే ఆలోచనకు వచ్చింది.     
–డా. ప్రశాంతి,  కేవీకే కడప

>
మరిన్ని వార్తలు