మెగా హౌసింగ్‌ గ్రౌండింగ్‌ లో సిక్కోలు నెం1

5 Jul, 2021 08:34 IST|Sakshi

మెగా హౌసింగ్‌ గ్రౌండింగ్‌లో జిల్లాకు రాష్ట్రంలోనే మొదటి స్థానం

లక్ష్యం కంటే అధికంగా శంకుస్థాపనలు 

శ్రీకాకుళం: కొత్త ఊళ్లకు పునాదులు పడ్డాయి. పేదల ఆశలకు, సర్కారు ఆశయానికి సత్తువనిస్తూ శంకుస్థాపనలు జోరుగా జరిగాయి. మెగా హౌసింగ్‌ గ్రౌండింగ్‌ మేళాలో సిక్కోలు మెగా సక్సెస్‌ అయ్యింది. లక్ష్యం కంటే అధికంగా శంకుస్థాపనలు చేసి అధికారులు జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టారు. రాష్ట్ర స్థాయిలో మన జిల్లాకు మూడు రో జులు మెగా గ్రౌండింగ్‌లో లక్ష్యంగా 24,125 ఇళ్లకు శంకుస్థాపన చేయాలని తెలిపారు. అయితే మూడు రోజుల్లో 52,541 ఇళ్లకు శంకుస్థాపన చేసి టార్గెట్‌ కంటే 200 శాతం ఎక్కువగా చేసిన ఘనత జిల్లాకు దక్కింది.   


గ్రాండ్‌గా గ్రౌండింగ్‌.. 
జగనన్న పేదల ఇళ్ల నిర్మాణ పథకం నిర్వహణలో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. పేదల ఇళ్ల శంకుస్థాపనకు జూలై 1, 3, 4వ తేదీల్లో ప్రభుత్వం మెగా హౌసింగ్‌ గ్రౌండింగ్‌ మేళా నిర్వహించింది. కార్యక్రమంలో 200 శాతానికి పైగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి సిక్కోలు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు టి.వేణుగోపాల్‌ వెల్లడించారు. ఈ మెగా గ్రౌండింగ్‌ మేళా కార్యక్రమం విజయవంతం కావడానికి వలంటీర్ల దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్, సంయుక్త కలెక్టర్లు డాక్టర్‌ కె.శ్రీనివాసులు, ఆర్‌.శ్రీరాములు నాయుడు, గృహ నిర్మాణ శాఖ సంయుక్త కలెక్టర్‌ హిమాంశు కౌశిక్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. జూలై 3న పొన్నాడలో నిర్వహించిన గ్రౌండింగ్‌ మే ళా కార్యక్రమంలో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజ య్‌ జైన్‌ వీడియో కాల్‌ ద్వారా నేరుగా లబ్ధిదారుల తో మాట్లాడి జిల్లా యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లను తెలుసుకొని సంతోషాన్ని వ్యక్తపరిచారని చెప్పారు.

ఇదే స్ఫూర్తి కొనసాగిద్దాం: కలెక్టర్‌ 
జిల్లాలో లక్ష్యానికి మించి గ్రౌండింగ్‌ చేశామని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్‌ తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించా లని ఆయన ఆకాంక్షించారు. మౌలిక సౌకర్యాల కల్పనలో సంబంధిత మండల ప్రత్యేక అధికారులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న గృహనిర్మాణ పథకాన్ని జిల్లాలో దిగ్విజయం చేసిన    వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.      

మరిన్ని వార్తలు