AP Assembly Session: నాలుగు బిల్లులకు ఆమోదం  

17 Sep, 2022 07:53 IST|Sakshi

సాక్షి, అమరావతి: నాలుగు బిల్లులకు శుక్రవారం శాసనసభ, శాసనమండలి ఆమోదం తెలిపాయి. ప్రస్తుత జెడ్పీ చైర్మన్ల పదవీకాలం ముగిసే వరకు ఉమ్మడి జిల్లాల ప్రకారమే పాత జిల్లా పరిషత్‌లు కొనసాగేందుకు వీలుగా ఏపీ పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లును ఉభయ సభలు ఆమోదించాయి. 

ఆర్‌డీసీలో ఇకపై 16 మంది సభ్యులు ఉండేలా ఏపీ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చట్ట సవరణ బిల్లుకు, ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ (డిసిప్లినరీ ప్రొసీడింగ్‌ బిల్లు) చట్ట సవరణ బిల్లుకు, సవరించిన మార్కెట్‌ సెస్‌ నుంచి కొంత మొత్తాన్ని కేంద్ర మార్కెట్‌ నిధికి జమ చేయడానికి ఉద్దేశించిన ఏపీ అగ్రికల్చరల్‌ ప్రొడ్యూస్‌ అండ్‌ లైవ్‌స్టాక్‌ మార్కెట్‌ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ, శాసనమండలి ఆమోదం తెలిపాయి. ఈ బిల్లులను గురువారం ఉభయ సభల్లో ప్రవేశపెట్టగా, శుక్రవారం ఆమోదించాయి. 

మరో నాలుగు బిల్లులు.. ఒక తీర్మానం 
శాసనసభలో శుక్రవారం మరో నాలుగు బిల్లులను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రవేశపెట్టారు. ఇండియన్‌ స్టాంప్‌ చట్ట సవరణ బిల్లు, ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ఉపసంహరణ బిల్లు, ఏపీ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ చట్ట సవరణ బిల్లును మంత్రి ధర్మాన సభలో ప్రవేశపెట్టారు. మరోవైపు రైల్వే ప్రయాణికుల కమిటీలో శాసనసభ నుంచి ఒకరిని నామినేట్‌ చేయాలని కోరుతూ సభ తీర్మానించింది.   

మరిన్ని వార్తలు