కుటుంబాన్ని మింగేసిన అప్పుల బాధలు 

5 Jun, 2021 10:06 IST|Sakshi
సగిలేరులో బయటపడ్డ తల్లీ కుమారుల మృతదేహాలు, బళ్లారిరామకృష్ణ, అనూషల పెళ్లినాటి ఫొటో

ఇద్దరు పిల్లలతో సహా డ్యాంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు

నలుగురూ మృతి 

బి.కోడూరు/బద్వేలు అర్బన్‌/పోరుమామిళ్లఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్ని మింగేశాయి. అప్పులు చేయడంతో వచ్చిన ఇబ్బందుల వల్ల ఆ తల్లిదండ్రులు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల చావుకు కారణమైంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగరు మృత్యువాత పడటం జిల్లాలో సంచలనమైంది. ఈ హృదయవిదారక ఘటన శుక్రవారం బి.కోడూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పోరుమామిళ్ల పట్టణం శ్రీరామ్‌నగర్‌వీధికిచెందిన బళ్లారిరామకృష్ణ (36) చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఈయనకు భార్య అనూష (30), కళ్యాణ్‌ (5), నిఖిల్‌ (6 నెలలు) కుమారులు ఉన్నారు.

రామకృష్ణ తన వ్యాపారాల కోసం పలువురి వద్ద అప్పులు చేశాడు. వ్యాపారాలు కలిసిరాక తీవ్రంగా నష్టపోయాడు. కుటుంబ పోషణకు కూడా ఇబ్బందులు పడుతుండేవాడు.అప్పులు ఇచ్చిన వారు బాకీ చెల్లించమని ఒత్తిడి తెస్తుండేవారు. ఈ క్రమంలో  అప్పులు ఎలా తీర్చాలా అని మదనపడిన ఆ దంపతులు చావు ఒక్కటే శరణ్యంగా భావించారు.  శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరారు. బి.కోడూరులోని ఎల్‌ఎస్‌పీ డ్యాం వద్దకు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా డ్యాంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం 10 గంటల సమయంలో అనూష, ఇద్దరు పిల్లల మృతదేహాలు నీటిపై తేలియాడుతూ కనిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

పోరుమామిళ్ల సీఐ మోహన్‌రెడ్డి, బి.కోడూరు ఎస్‌ఐ వరలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీయించారు.  రాత్రి 10 గంటల సమయంలో రామకృష్ణ మృతదేహం కూడా లభించింది. అయితే ఉదయం నుంచి తల్లీబిడ్డలు డ్యాంలో దూకి మృతిచెందారన్న వార్త దావానంలా వ్యాపించినప్పటికీ మృతుని తల్లిదండ్రులు రాత్రి వరకు విషయాన్ని బయటికి చెప్పకపోవడం గమనార్హం. ఆ నోట ఈ నోట పడి పోలీసులకు విషయం తెలియడంతో విచారించగా అప్పుల బాధతో ఇంటి నుండి వెళ్లిపోయారని, ఏం జరిగిందో తమకు తెలియదని పోలీసులకు తెలిపినట్లు తెలిసింది.  బి.కోడూరుపోలీసులు కేసు నమోదు చేశారు. 

మేమేం పాపం చేశాం!
అమ్మా, నాన్న అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మమ్మల్ని ఎందుకు చంపారు.మీరు పిలవగానే మీపై నమ్మకంతో మీ వెంటే వచ్చాం కదా. మాపై కనికరం లేకుండా నీటిలో తోసేసిన మీకు మేము ఊపిరాడకకొట్టుకుంటున్నప్పుడన్నా మీ హృదయం కరగలేదా... మేం ఏం పాపం చేశాం. మీ కడుపున పుట్టడమే మేము చేసిన పెద్ద నేరమా. 
(మృతిచెందిన ఇద్దరు చిన్నారుల ఆత్మఘోష)

చదవండి: ‘గారాల పట్టి.. మేము ఎలా బతికేది తల్లీ’   
భార్యను చంపి.. ఆపై భర్త ఆత్మహత్య

మరిన్ని వార్తలు