పేలిన గ్యాస్‌ సిలిండర్‌, ఫ్రిజ్‌

29 Dec, 2020 09:08 IST|Sakshi
క్షతగాత్రులు వంకా శ్రీనివాసులు, వంకా మునిసుబ్బమ్మ, వంకా జాహ్నవి, వంకా చరణ్‌సాయి 

నలుగురికి తీవ్రగాయాలు

ఇద్దరి పరిస్థితి విషమం

సాక్షి, సూళ్లూరుపేట: అందరూ గాఢనిద్రలో ఉండగా ఇంట్లోని గ్యాస్‌ సిలిండర్‌ పేలి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పట్టణంలోని కాపువీధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. కాపువీధిలో నివాసం ఉంటున్న వంకా శ్రీనివాసులు (49), భార్య వంకా మునిసుబ్బమ్మ (40) కుమార్తె జాహ్నవి (10) కుమారుడు చరణ్‌సాయి (4) ఆదివారం రాత్రి భోజనాల అనంతరం అందరూ నిద్రిస్తున్నారు. సిలిండర్‌ పైపు నుంచి గ్యాస్‌ లీకై ఇల్లంతా వ్యాపించింది. ఆదివారం రాత్రి 12.30 గంటల సమయంలో గ్యాస్‌ వాసన వస్తుండడంతో అప్రమత్తమైన శ్రీనివాసులు  లేచి లైట్‌ వేయగానే ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. లీకైన గ్యాస్‌ ఫ్రిజ్‌ కిందకు కూడా వ్యాపించడంతో మంటలు అధికమై ఫ్రిజ్‌ పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. లీకైన గ్యాస్‌ బెడ్‌రూంలోకి కూడా వ్యాపించడంతో గాఢ నిద్రలో ఉన్న శ్రీనివాసులు కుమార్తె, కుమారుడు మంచాల కింద నుంచి మంటలు రేగి అగ్ని ప్రమాదానికి గురయ్యారు.

ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు వెంటనే 108కి ఫోన్‌ చేస్తే ఓజిలిలో ఉన్నట్లు సమాధానం చెప్పారు. ఆగ్నిమాపక కార్యాలయానికి ఫోన్‌ చేస్తే ఆ ఫోన్‌ పనిచేయడం లేదు. రాత్రి గస్తీలో ఉన్న పోలీసులు స్పందించి స్థానికులతో కలిసి క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా  ఉండడంతో నెల్లూరు సింహపురి ఆస్పత్రికి తరలించారు. వీరిలో శ్రీనివాసులు, కుమార్తె జాహ్నవి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మునిసుబ్బమ్మ, చరణ్‌సాయి పరిస్థితి మెరుగ్గా ఉందని బాధిత బంధువుల ద్వారా తెలిసింది. ఈ ప్రమాదంపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు