అన్నింటికి ఆ నలుగురే

26 Aug, 2020 10:45 IST|Sakshi

వీధిలో ఎవరికైనా కరోనా వచ్చిందంటే అటువైపు వెళ్లడానికే భయపడే రోజులివి. ఇంట్లో సైతం ఎవరికైనా పాజిటివ్‌గా తేలితే  ఆమడదూరం నుంచే సేవలందిస్తున్న కాలమిది. ఇలాంటి పరిస్థితుల్లోనూ కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను మార్చురీ నుంచి తీసి.. వాటిని అంత్యక్రియలకు వాహనంలో పంపిస్తున్నారు పెద్దాసుపత్రిలోని ‘ఆ నలుగురు’. మృతులకు సగౌరవంగా ‘వీడ్కోలు’ చెబుతున్న వీరిని అధికారులు సైతం అభినందిస్తున్నారు. 

సాక్షి, కర్నూలు : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (పెద్దాసుపత్రి)ను స్టేట్‌ కోవిడ్‌ హాస్పిటల్‌గా మార్చిన తర్వాత ఇతర కోవిడ్‌ ఆసుపత్రుల్లో తీవ్ర అస్వస్థతకు గురైన కరోనా రోగులను సైతం ఇక్కడికే రెఫర్‌ చేస్తున్నారు. ఈ కారణంగా పెద్దాసుపత్రిలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జిల్లాలో ఈ ఐదు నెలల కాలంలో కరోనాతో 337 మంది చనిపోయారు. ఇందులో అధిక శాతం మరణాలు పెద్దాసుపత్రిలోనే  నమోదయ్యాయి.

సాధారణంగా ఎవరి సంప్రదాయం ప్రకారం వారు మృతులకు అంత్యక్రియలు చేస్తారు. కానీ కరోనా కారణంగా మృతదేహాల వద్దకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు సైతం భయపడే రోజులు దాపురించాయి. ఇదే సమయంలో వైరస్‌ ఇతరులకు వ్యాపించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తోంది. మృతదేహాలను అంత్యక్రియలకు పంపేందుకు గాను పెద్దాసుపత్రిలో నలుగురు ఎంఎన్‌వోలను నియమించారు. వీరు కరోనా బాధితుల మృతదేహాలపై వార్డులోనే కెమికల్స్‌ చల్లి,  ప్లాస్టిక్‌ కవర్‌లో భద్రంగా ప్యాక్‌ చేస్తారు. ఆ తర్వాత మార్చురీలో భద్రపరుస్తారు. అనంతరం బయటకు తీసి, వాటిని ‘మహాప్రస్థానం’ వాహనంలో  అంత్యక్రియలకు పంపిస్తున్నారు. ఈ సమయంలో పీపీఈ కిట్లు, మాస్క్‌లు ధరించి జాగ్రత్తలు వహిస్తున్నారు. 

ధైర్యవంతుడని ప్రోత్సహిస్తున్నారు 
ఆ భగవంతునికి సేవ చేస్తున్నానని భావించి మృతదేహాలను ఎత్తి పంపిస్తున్నాను. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందీ లేదు. భార్య, కుమారుడు ఉన్నారు. గతంలో కూలి పనిచేసేవాన్ని. ఇప్పుడు ఈ పని తృప్తిగా అనిపిస్తోంది. ఇరుగూ పొరుగు వారు కూడా ఇబ్బంది పెట్టడం లేదు. పైగా వారు ప్రోత్సహిస్తున్నారు. చాలా మంచిది.. ధైర్యవంతుడని  చెబుతున్నారు.  
– బరిగెల పవన్‌కుమార్, శ్రీరామనగర్, కర్నూలు  

మరిన్ని వార్తలు