నలుగురిని మింగిన ఊటబావి

17 Sep, 2022 08:17 IST|Sakshi

పూడిక తీస్తూ ఊపిరాడక ఆగిన గుండెలు

కృష్ణాజిల్లా బంటుమిల్లిలో విషాదం 

మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి జోగి రమేష్‌

బంటుమిల్లి: ఊటబావి నాలుగు నిండుప్రాణాలను బలితీసుకుంది. పూడిక తీసేందుకు బావిలో దిగినవారు ఒకరి తర్వాత మరొకరు ఊపిరి ఆడక ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా బంటుమిల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. బంటుమిల్లి గ్రామానికి చెందిన కొండా నాగేశ్వరరావు అడితి (కర్రలు) వ్యాపారి. తన నివాసం వద్ద ఉన్న ఊటబావి పూడిక తీయడానికి తన కుమారుడు కొండా రంగా(35) ద్వారా గ్రామంలోని బీఎన్‌ఆర్‌ కాలనీకి చెందిన కూలీ వంజల రామారావు(60)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. రామారావు తనకు సహాయంగా కుమారుడు వంజల లక్ష్మణ్‌(35), శ్రీనివాసరావు(53)ను తీసుకుని వచ్చాడు.

పూడిక తీసేందుకు శుక్రవారం మధ్యాహ్నం బావిలోకి దిగారు. ముందుగా శ్రీనివాసరావు దిగి నాలుగు బకెట్ల మట్టిని తోడాక ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యాడు.   అతను కేకలు వేయగా.. రామారావు, లక్ష్మణ్‌ తాడువేసి పైకి లాగే ప్రయత్నం చేశారు. అయితే, శ్రీనివాసరావుకు ఆక్సిజన్‌ అందకపోవడంతో పట్టుకున్న తాడును వదిలి బావిలో పడిపోయాడు. ఆ వెంటనే రామారావు బావిలోకి దిగి ఊబిలో పడిపోయాడు. తన తండ్రి పడిపోయాడని తెలుసుకున్న లక్ష్మణ్‌ హడావుడిగా వచ్చి బావిలోకి దిగి ఇరుక్కుపోయాడు. ముగ్గురు ప్రమాదంలో చిక్కుకున్నారని రక్షించేందుకు రంగా బావిలోకి దిగాడు. ఒకరి కోసం మరొకరు బావిలోకి దిగి ఊపిరాడక నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 

బంటుమిల్లిలో విషాదం..
ఊటబావిలో ఊపిరి ఆడక మృతి చెందిన నలుగురి మృతదేహాలను గ్రామస్తులు అతికష్టంపై వెలికి తీశారు. అప్పటి వరకు మాట్లాడుతున్న వారు కళ్ల ఎదుటే మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుల భార్యలు, పిల్లల ఆర్తనాదాలు చూసి స్థానికులు చలించిపోయారు. మృతిచెందిన వారిలో రంగాకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, లక్ష్మణ్‌కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఏమైందో తెలియని పసిపిల్లలు తమ తండ్రుల మృతదేహాలను చూపిస్తూ ‘అమ్మా... నాన్న..’ అంటూ కన్నీరు పెట్టుకోవడం అందరినీ కలచివేసింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర గృహణ నిర్మాణ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్‌ హుటాహుటిన బంటుమిల్లికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు