పాపం పులి.. నల్లమలలో వేటకు వెళ్తూ వరుస మరణాలు!

8 Jan, 2022 10:33 IST|Sakshi

నల్లమలలో రెండేళ్లలో నాలుగు పులులు మృతి

రక్షణకు ప్రత్యేక చర్యలపై అధికారుల దృష్టి 

నల్లమలలో 65 పెద్దపులులు.. 75కిపైగా చిరుతలు 

పులి పంజా విసిరితే ఎలాంటి వన్యప్రాణి అయినా దానికి ఆహారం కావాల్సిందే. అయితే, ఆహారం కోసం వేటాడుతూ అరణ్యం దాటి బయటకొస్తున్న పులులు ప్రమాదాల బారినపడి మృత్యు వాతపడుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ తరచూ పులులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఒక వైపు పులుల సంతతి పెంచేందుకు చర్యలు తీసుకుంటుంటే.. మరో వైపు వేటాడే నేపథ్యంలో అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. దీంతో పులుల సంరక్షణపై అటవీశాఖ అధికారులు మరింత దృష్టి సారించారు.

రెండేళ్లలో మృతిచెందిన పులుల వివరాలు... 
2020 జనవరి 20వ తేదీ కర్నూలు–గుంటూరు రహదారిపై నల్లమలలోని ఆర్‌.చెలమ బావి వద్ద కోతులను వేటాడే క్రమంలో ఓ చిరుతకూన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. 
► 2020 ఏప్రిల్‌ నెలలో యర్రగొండపాలెం సమీపంలోని గాలికొండలో అటవీ ప్రాంతంలో వృద్ధాప్యంతో తీవ్రమైన ఎండవేడిమిని తట్టుకోలేక పెద్ద పులి మృతి చెందింది. 
► 2021 నవంబర్‌ 12న గిద్దలూరు–నంద్యాల మధ్య చలమ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌ దాటుతూ ప్రమాదవశాత్తూ రైలు కింద పడి పెద్ద పులి మృతి చెందింది. 
 తాజాగా కోతిని వేటాడే క్రమంలో మరో చిరుత బావిలో పడి మృతిచెందిన సంఘటన ఈనెల 6న వెలుగుచూసింది. 

మార్కాపురం: నల్లమల అటవీ ప్రాంతంలో వరుసగా పులులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వాటి సంరక్షణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నప్పటికీ.. గడిచిన రెండేళ్లలో రెండు చిరుతలు, రెండు పెద్ద పులులు మృతి చెందాయి. ప్రధానంగా వేటాడే క్రమంలో ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నాయి. నల్లమల అభయారణ్యాన్ని కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌ (రాజీవ్‌ అభయారణ్యం)గా ప్రకటించింది. దోర్నాల–శ్రీశైలం, శ్రీశైలం–తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్‌ పరిధిలో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు పులుల సంచారం ఉన్నందున అటవీశాఖ గేట్లను ఏర్పాటు చేసి రహదారులపై రాకపోకలను నిలిపివేస్తోంది. వేటగాళ్ల నుంచి పులులను కాపాడేందుకు నల్లమలలో 24 బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు. మొత్తం 120 మంది టైగర్‌ ట్రాకర్లు పనిచేస్తున్నారు. ఒక్కో బేస్‌ క్యాంప్‌లో ఐదుగురు సభ్యులు ఉంటారు. వీరు కాకుండా స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ సిబ్బంది అడవిలో తిరుగుతుంటారు. 

పులుల మృతికి కారణాలు... 
జంతువులను వేటాడుతూ అడవిలో నుంచి రోడ్లపైకి, రైల్వేట్రాక్‌లపైకి వచ్చిన సమయంలో ప్రమాదవశాత్తూ వాహనాలు ఢీకొని పులులు మృతిచెందుతున్నాయి. వేసవిలో మంచినీటి కోసం జనారణ్యంలోకి వెళ్లే క్రమంలోనూ రోడ్లు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి. అదే సమయంలో పొలాల్లో అడవి పందుల కోసం వేసిన ఉచ్చులు, విద్యుత్‌ సరఫరాతో కూడిన కంచెల్లో చిక్కుకుని కూడా పులులు మృతిచెందే ప్రమాదం ఉంది. వేటాడే క్రమంలో అడవిలోని బావుల్లో పడి నీటిలో నుంచి బయటపడలేక కూడా తాజాగా చిరుత మృతిచెందింది. 

గతంతో పోలిస్తే నల్లమలలో పెరిగిన పులుల సంఖ్య... 
మన రాష్ట్రంలోని ప్రకాశం, గుంటూరు, కర్నూలు, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 3,568 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో 65 పెద్ద పులులు, 75కిపైగా చిరుతలు ఉన్నాయి. వాటిలో మార్కాపురం డివిజన్‌ అటవీ ప్రాంతం దాదాపు 900 కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఇటీవల పులుల గణనను ప్రారంభించారు. వాటి కాలి గుర్తులు, ట్రాక్‌ చేసిన సీసీ కెమేరాల ద్వారా దాదాపు 65 పులులు ఉన్నట్లు గుర్తించారు. అందులో దాదాపు 5 పులులు తెలంగాణ అడవిలో కూడా సంచరిస్తున్నట్లు భావిస్తున్నారు. మార్కాపురం డీఎఫ్‌వో పరిధిలో శ్రీశైలం, నంద్యాల, గుంటూరు జిల్లా మాచర్ల, విజయపురిసౌత్‌ ప్రాంతాల్లో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి పులుల సంఖ్యను అధికారికంగా లెక్కిస్తారు. దానిలో భాగంగా నాలుగేళ్ల క్రితం నల్లమలలో 40 నుంచి 48 పెద్ద పులులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 65కి చేరింది. ఇక చిరుత పులులు 75కిపైగా ఉన్నాయి. వాటితో పాటు అరుదైన అలుగు, వేల సంఖ్యలో జింకలు, దుప్పులు, నెమళ్లు, రేచుకుక్కలు, ముళ్ల పంది, ఈలుగ, ఎలుగుబంట్లు ఉన్నాయి.

పులుల రక్షణకు ప్రత్యేక చర్యలు
నల్లమలలో పులుల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పులులతో పాటు ఇతర జంతువులకు తాగునీటి సమస్య లేకుండా చాలా ప్రాంతాల్లో సాసర్‌ పిట్లు ఏర్పాటుచేసి నీటి వసతి కల్పించాం. పులులు సంచరించే ప్రాంతాల్లో కెమేరాలు బిగించాం. బేస్‌క్యాంప్‌ సిబ్బంది 24 గంటల పాటు పులుల సంరక్షణపై దృష్టి పెడతారు. అడవుల్లోకి ఎవరొచ్చినా మాకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాం. నిబంధనలు అతిక్రమించి జంతువులపై దాడులకు పాల్పడితే నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేస్తాం. నల్లమలలో మరో బేస్‌ క్యాంప్‌ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. గిద్దలూరు–నంద్యాల మధ్య ఉన్న రైల్వే ట్రాక్‌ ప్రాంతాల్లో కొన్ని చోట్ల రైళ్ల వేగం తగ్గించాలని ప్రతిపాదనలు పంపారు. దీంతో పాటు అండర్‌ పాస్‌ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని ఉన్నాతాధికారులకు తెలిపారు. అటవీ ప్రాంతంలో నీటి కొరత లేకుండా చేశాం. కృష్ణా రివర్‌ ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువగా ఉన్నందున గట్టి భద్రతా చర్యలు తీసుకున్నాం.
– విఘోష్‌ అప్పావ్, డీఎఫ్‌వో, మార్కాపురం

మరిన్ని వార్తలు