నాలుగేళ్ల చిన్నారికి లివర్‌ కేన్సర్‌

8 Apr, 2021 11:07 IST|Sakshi
తల్లితో చిన్నారి గణ మద్దిలేటి   

మెరుగైన వైద్యం అందించాలన్న డాక్టర్లు

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

కోవెలకుంట్ల: నాలుగేళ్ల వయస్సులోనే ఓ చిన్నారికి పెద్దకష్టం వచ్చింది. ఆడుతూ, పాడుతూ ఆరోగ్యంగా గెంతులేయాల్సిన పసిబాలుడు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నాడు. లివర్‌ కేన్సర్‌తో రోజులు లెక్కపెడుతున్న దుస్థితి నెలకొంది. కోవెలకుంట్ల పట్టణంలోని ఆటోనగర్‌లో నివాసం ఉంటున్న చాకలి మహేష్‌, బనగానపల్లెకు చెందిన మహాదేవికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు సుబ్బ మద్దిలేటి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. నాలుగేళ్ల వయస్సు ఉన్న గణ మద్దిలేటి రెండవ కుమారుడు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో బాడుగ ఇంట్లో నివాసం ఉంటున్నారు.

చాకలి వృత్తి, వ్యవసాయ, ఉపాధి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెండవ కుమారుడికి నాలుగు నెలల క్రితం తీవ్ర జ్వరం రావడంతోపాటు తల వెంట్రుకలు ఊడిపోవడం, పొట్ట, కాళ్లు, చేతులు వాపురావడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు లివర్‌ కేన్సర్‌ సోకిందని హైదరాబాదుకు తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ఇప్పటి వరకు చిన్నారికి ఆధార్‌కార్డు కూడా లేకపోవడంతో ఆరోగ్యశ్రీ పథకం వర్తించే అస్కారం లేకుండా పోయింది. నాలుగు నెలల నుంచి ఇప్పటి వరకు రూ.లక్ష వరకు ఖర్చు కాగా తల్లిదండ్రులు దొరికిన చోటంతా అప్పులు చేసి చిన్నారి ప్రాణాన్ని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం సుమారు రూ.మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో దాతల ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. దాతలెవరైనా 9133483763 నంబర్‌కు ఫోన్‌ చేసి ఆదుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
చదవండి:
మేయరమ్మా... ఇదేంటమ్మా!    
ఎవరికీ అనుమానం రాదు.. ఈ దొంగ ప్రత్యేకత ఇదే..

మరిన్ని వార్తలు