చకచకా అడిగితే... టకటకా చెప్పేస్తోంది!

1 Jun, 2022 10:45 IST|Sakshi

తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): నాలుగేళ్లకే 198 దేశాలు.. వాటి రాజధానులు టకటకా చెప్పేసింది. అదీ కేవలం రెండున్నర నిమిషాల్లో.. చాలా మందికి అసాధ్యమనుకునే ఈ ఘనతను సాధించి రికార్డులకెక్కింది. స్కూల్‌ ముఖం కూడా చూడని ఆ వయసులో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు లిఖించుకుంది. ఆమే ఎండాడకు చెందిన దత్తు ప్రకాష్, దత్తు అపర్ణల ముద్దుబిడ్డ దత్తు శ్రీ నందన.  

శ్రీనందన చిన్నప్పటి నుంచి టీవీ, మొబైల్‌కు వంటి వాటికి ఆకర్షణకు గురి కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించారు. చిన్నారిలో అంతర్లీనంగా దాగి ఉన్న తెలివితేటలు, జ్ఞాపకశక్తిని గుర్తించి.. కథలో పాటు జనరల్‌ నాలెడ్జ్‌ అంశాలు వివరించే ప్రయత్నం చే శారు. అలా 198 దేశాల పేర్లు, రాజధానులు నేర్పించారు. నాలుగేళ్లకే అవన్నీ గుర్తుకు పెట్టుకున్న నందన కేవలం రెండున్నర నిమిషాల్లోనే  దేశాలు– రాజధానులు టకటకా చెప్పి.. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం చిన్నారి వయసు ఏడేళ్లు.

ఇప్పుడు ప్రపంచంలోని మొత్తం దేశాలు వాటి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ సరిహద్దులను ఠక్కున చెబుతోంది. ఈ చిన్నారి తన మైండ్‌లో గ్లోబ్‌ మొత్తం గుర్తుకు పెట్టుకుంది. ప్రపంచ దేశాలు, నాలుగు సరిహద్దులకు సంబంధించి దాదాపు 800 ప్రశ్నలకు సమాధానాలను కొన్ని సెకన్లలో చెప్పేస్తోంది. ఇది కేవలం మైండ్‌ మ్యాపింగ్‌ అనే పద్ధతి ద్వారా మాత్రమే సాధ్యమని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. ఈ ఈవెంట్‌తోనే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు కోసం ప్రయత్నం చేసింది.

ఇటీవల పిక్‌ ఏ బుక్‌ వేదికపై జరిగిన ఈవెంట్‌లో న్యాయనిర్ణేతల సమక్షంలో శ్రీనందన ప్రదర్శనను రికార్డ్‌ చేసి.. గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులకు పంపించారు. ఆమె ప్రతిభను గుర్తించిన నాటి కలెక్టర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌ మొదలు స్థానిక నాయకులు, గాయకులు, ప్రముఖులు ఇలా ఎందరో శ్రీనందనను ప్రశంసించారు. పలు టీవీ షోలు, ఎఫ్‌ఎంలలో శ్రీనందన తన అనుభవాలను పంచుకుంది.  

(చదవండి: ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం )

మరిన్ని వార్తలు