మోడల్‌ స్కూళ్లకు ఫ్రాన్స్‌ చేయూత

3 Jan, 2021 16:08 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ తీర్చిదిద్దిన మోడల్‌ కార్పొరేషన్‌ స్కూళ్లను చూసి అచ్చెరువొందిన ఫ్రాన్స్‌ ప్రభుత్వం.. మరిన్ని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు సహకారం అందిస్తోంది. గ్రేటర్‌ పరిధిలోని 44 కార్పొరేషన్‌ స్కూళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ టు ఇన్నోవేట్‌ అండ్‌ సస్టైన్‌ (సిటీస్‌) పేరుతో ఫ్రెంచ్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఏఎఫ్‌డీ) రూ.52 కోట్ల నిధులు సమకూర్చింది. 
ఈ నిధులతో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టాలనే అంశాలపై సిటీస్‌ బృందం ఇప్పటికే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, జీవీఎంసీ అధికారులతో సమావేశమైంది.

వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరించింది. నగరాన్ని స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేసేందుకు విభిన్న ప్రాజెక్టులతో ముందుకెళ్తున్న మహా విశాఖ నగర పాలక సంస్థ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. సిటీస్‌ చాలెంజ్‌ పేరుతో ఏడాది కిందట జరిగిన పోటీలో 15 నగరాలకు సంబంధించి మొత్తం 26 ప్రాజెక్ట్‌లు ఎంపికవ్వగా.. ఇందులో కార్పొరేషన్‌ పాఠశాలలను ఆధునికీకరించిన జీవీఎంసీ ప్రాజెక్ట్‌ అవార్డు సొంతం చేసుకుంది. ఈ ప్రాజెక్ట్‌ ఫ్రాన్స్‌ ప్రభుత్వాన్ని ఆకర్షించింది. దీనికి ఫిదా అయిన ఫ్రాన్స్‌ ప్రభుత్వ అనుబంధ సంస్థ ఫ్రెంచ్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఏఎఫ్‌డీ) మరిన్ని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది.

మరిన్ని వార్తలు