జగనన్న ఇళ్లకు ఉచిత విద్యుత్‌ సర్వీసు 

29 Apr, 2022 03:47 IST|Sakshi

తొలిదశలో 10,741 లేఅవుట్లకు సదుపాయం 

మూడు డిస్కమ్‌ల పరిధిలో 14,49,133 సర్వీసులకు విద్యుత్‌ 

రూ.4,600 కోట్ల రుణానికి ప్రభుత్వం హామీ  

సాక్షి, అమరావతి: నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతుండగా 17 వేల జగనన్న కాలనీలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ కాలనీలకు డిస్కమ్‌ల ద్వారా మొదటిదశలో 14,49,133 సర్వీసులకు విద్యుత్‌ సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. దీనికి అవసరమైన నిధులను గృహ నిర్మాణ శాఖకు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వమే రుణ దాతలకు హామీ ఇస్తోంది. రూ.4,600 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ), రూరల్‌ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ) ముందుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. 

మొదటి దశ పనులు మొదలు 
పేదలందరికీ ఇళ్లు పథకం మొదటి దశకి సంబంధించి ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాల్లో 3,951 లే అవుట్లు ఉండగా 3,28,383 ఇళ్లకు విద్యుత్‌ సర్వీసులు అందించనున్నారు. దీని కోసం రూ.1,217.17 కోట్లు వెచ్చిస్తున్నారు. ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాల్లో 2,813 లే అవుట్లు ఉండగా 5,16,188 ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లను రూ.2,519.73 కోట్లతో అందించనున్నారు. ఏపీసీపీడీసీఎల్‌లోని మూడు జిల్లాలతోపాటు సీఆర్‌డీఏ పరిధిలో 3,977 లే అవుట్లు ఉన్నాయి. వీటిలో 6,04,562 ఇళ్లకు విద్యుత్‌ సర్వీసులను రూ.1,805.04 కోట్లతో ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించి ఇప్పటికే పనులు ప్రారంభించారు. వాటర్‌ వర్క్స్‌కు సంబంధించి బోర్లకు విద్యుత్‌ సర్వీసులు అందిస్తున్నారు. లైన్లు మారుస్తున్నారు. 

జాతీయ, అంతర్జాతీయ సహకారం 
రాష్ట్రంలో 15,000 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేసే అవకాశం ఉన్నట్లు గుర్తించడంతో ప్రభుత్వం ఇప్పటికే ఎనర్జీ కన్సర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌ (ఈసీబీసీ)–2017ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. దీన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) సహకారంతో ఒక్కో ఇంటికి నాలుగు ఎల్‌ఈడీ బల్బులు, రెండు ఎల్‌ఈడీ ట్యూబ్‌ లైట్లు, రెండు ఎనర్జీ ఎఫిషియెంట్‌ ఫ్యాన్లను అందించనున్నారు. లబ్ధిదారుల అంగీకారంతో ఇంటి నిర్మాణానికి విద్యుత్‌ పొదుపు డిజైన్లను అనుసరించనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు జర్మనీకి చెందిన అంతర్జాతీయ బ్యాంకు కేఎఫ్‌డబ్ల్యూ 152 మిలియన్‌ యూరోలు అందిస్తామని హామీ ఇచ్చింది.

అత్యున్నత ప్రమాణాలు.. 
రాష్ట్రంలో మొత్తం విద్యుత్‌ వినియోగంలో 42 శాతం బిల్డింగ్‌ సెక్టార్‌లోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంధన సామర్థ్య సాంకేతికత పరిజ్ఞానం కలిగిన గృహాల నిర్మాణాన్ని దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర  ప్రభుత్వం చేపట్టింది. జగనన్న ఇళ్లలో అత్యున్నత ఇంధన పొదుపు ప్రమాణాలను పాటించేందుకు ఇండో స్విస్‌ బీప్‌ (బిల్డింగ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్‌) సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. దీనివల్ల బయట ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇళ్లలో 3 నుంచి 5 డిగ్రీలు తగ్గుతుంది. సహజ సిద్ధమైన గాలి,  వెలుతురు ఉండటం వల్ల విద్యుత్‌ వినియోగం 20 శాతం తగ్గి కరెంటు బిల్లులు ఆదా కానున్నట్లు ఇంధన శాఖ అధికారులు పేర్కొంటున్నారు.  

మరిన్ని వార్తలు