ఒక ఎన్నారై సంకల్పం.. ఎందరికో దృశ్య కావ్యం

7 Sep, 2023 13:24 IST|Sakshi

పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్న ప్రవాసాంధ్రుడు

తల్లి పేరిట వైద్య శిబిరం నిర్వహించిన రమేష్‌ రెడ్డి వల్లూరి

ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 12 రోజుల పాటు శిబిరం

వెయ్యికి పైగా రోగులకు చికిత్స, 238 మందికి శస్త్రచికిత్స

కడప: దృష్టి.. జీవన ప్రయాణంలో అత్యంత కీలకం. కళ్లు సరిగా ఉంటే.. ఏ పనయినా చేసుకోవచ్చు. కానీ కొందరు కళ్లను సరిగా పట్టించుకోకపోవడం వల్ల అది దృష్టి లోపానికి దారి తీస్తోంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల కంట్లో శుక్లాలకు దారి తీస్తుంది. ఇలాంటి అభాగ్యులకు అండగా నిలిచారు అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుడు వల్లూరు రమేష్ రెడ్డి.ఆకేపాడు గ్రామంలోని అమర్నాథరెడ్డి నివాసంలో చెన్నై శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 12 రోజులపాటు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం రవాణా సదుపాయంతో పాటు ఉండేందుకు వసతి కల్పించారు. ఈ శిబిరం ద్వారా ఏకంగా 238 మంది కంటి శస్త్రచికిత్సలు చేయించుకోవడం నిజంగా గొప్ప విషయం.

శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరం ముగింపు సమావేశానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పేద బడుగు బలహీన వర్గాల వారికి అన్నివేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలనే ఉద్దేశంతో పట్టణాన్ని సైతం వదిలి స్వగ్రామంలోనే నివాసం ఉంటూ నిత్యం వివిధ రకాల సేవలను పేదలకు అందిస్తున్న జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి సేవా తత్పరుడని కడప మేయర్ సురేష్ బాబు తెలిపారు. అలాగే వైఎస్సార్‌సిపి అమెరికా కన్వీనర్ వల్లూరు రమేష్ రెడ్డి తల్లి తండ్రుల జ్ఞాపకార్థం 30 లక్షల రూపాయలు వెచ్చించి ఈ ఉచిత కంటి శిబిరం నిర్వహించి 238 మందికి కంటి చూపు తెప్పించడం చాలా అదృష్టమని అన్నారు. ఎక్కడో అమెరికాలో స్థిరపడి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ పుట్టిన గడ్డను మరవకుండా బడుగులకు సేవలు అందిస్తోన్న వల్లూరు రమేష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

12 రోజులు పాటు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 1032 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 238 మందిని ఆపరేషన్లు చేయించేందుకు నిర్ణయించారు. పూర్తిగా ఉచితంగా ఈ చికిత్స అందించడంతో పాటు అద్దాలు, మందులను కూడా పంపిణీ చేశారు. ఎప్పుడో ఓసారి ఎక్కడో ఓ చోట ఏవైనా కార్పొరేట్‌ ఆసుపత్రులు ఒక్కరోజు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటారని కానీ 12 రోజులు పాటు ఏకతాటిగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి సేవ చేయాలనే ఆలోచన చాలా గొప్పదని సురేష్‌బాబు కొనియాడారు. రమేష్‌ రెడ్డి చేసిన సేవకు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈ ప్రాంతం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వారందరూ ఆకేపాటి అమర్నాథరెడ్డిని ఆదర్శంగా తీసుకొని వారి వారి స్వగ్రామాల్లో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తే గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతాయని చెప్పారు.

పుట్టిపెరిగిన గడ్డ అమ్మకు సమానమని, ఆ మాతృభూమికి ఎంతో కొంత సేవ చేసే అవకాశం నిజంగా అదృష్టమన్నారు రమేష్‌ రెడ్డి వల్లూరు. వైఎస్సార్‌ కడప జిల్లా నుంచి మూడు దశాబ్దాల కింద అమెరికా వెళ్లిన రమేష్‌ రెడ్డి ప్రస్తుతం వాషింగ్టన్ డి.సి.లో స్థిరపడ్డారు. ఇటీవలే తన తల్లితండ్రుల స్మృతిలో భాగంగా శంకర నేత్రాలయ ద్వారా ఈ ఉచిత కంటి శిబిరానికి తన వంతుగా చేయూత నిచ్చారు.

ఈ శిబిరానికి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యులు గజేందర్‌ కుమార్‌ వర్మ, డాక్టర్ సురభి, డాక్టర్ శంకర్‌ హాజరై శిబిరానికి వచ్చిన వారికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేశారు. వీరికి శంకర నేత్రాలయ నుంచి అరుల్‌ కుమార్‌, రంజిత్‌ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చొప్ప ఎల్లారెడ్డి, వైసీపీ నాయకులు పోలి మురళి, దాసరి పెంచలయ్య, డీలర్ సుబ్బరామిరెడ్డి, మహర్షి, రమేష్ నాయుడు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు